హోటళ్ల అరాచకం
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:54 AM
నరసింహనగర్‌లో గల ‘ముంతాజ్’ హోటల్‌లో ఈ ఏడాది జూన్ నెలలో ఆహార భదత్ర, ప్రమాణాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కుళ్లిపోయిన కోడిగుడ్లు, దుర్వాసన వెదజల్లుతున్న చికెన్, చేప, రొయ వంటకాలను గుర్తించారు.
రోజుల తరబడి ఆహారం నిల్వ
వేడి చేసి వడ్డిస్తున్న నిర్వాహకులు
ఆహార భదత్ర, ప్రమాణాల శాఖ అధికారుల తనిఖీల్లో బహిర్గతం
వందలాది కిలోల నిల్వ ఆహారం గుర్తింపు
కేసులు నమోదు, జరిమానా విధింపు
- అయినా కానరాని మార్పు
- రుచి కోసం కెమికల్స్, టేస్టింగ్ సాల్ట్స్ వినియోగం
ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్న వైద్యులు
బయట ఆహారానికి దూరంగా ఉండాలని సూచన
విశాఖపట్నం నవంబరు 25 (ఆంధ్రజ్యోతి):
నరసింహనగర్‌లో గల ‘ముంతాజ్’ హోటల్‌లో ఈ ఏడాది జూన్ నెలలో ఆహార భదత్ర, ప్రమాణాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కుళ్లిపోయిన కోడిగుడ్లు, దుర్వాసన వెదజల్లుతున్న చికెన్, చేప, రొయ వంటకాలను గుర్తించారు. హోటల్‌పై కేసు నమోదు చేశారు.
ఆగస్టు ఒకటి, రెండు తేదీల్లో నగరంలోని 40 హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి కిలోల కొద్దీ నిల్వ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 17 హోటళ్లలో అత్యంత దారుణ స్థితిలో ఉన్న ఆహారాన్ని గుర్తించి కేసులు నమోదు చేశారు.
ఆగస్టు 22న ఎంవీపీ కాలనీలోని ‘మిసెస్ ఆహా ఏమి రుచులు రెస్టారెంట్’లో అధికారులు మూడు రోజులకు మించి నిల్వ ఉన్న 85 కిలోల చికెన్, మటన్, రొయ్య, చేపతోపాటు చేసిన వంటకాలను గుర్తించారు.
ఈ నెల 11న నరసింహనగర్‌లోని ‘సెలబ్రేషన్స్’లో 12.3 కిలోల నిల్వ ఆహార పదార్థాలను గుర్తించారు. ఇందులో చికెన్, మటన్, బిర్యానీలతోపాటు ఇతర ఆహార పదార్థాలు ఉన్నాయి.
22న ఇసుకతోట సమీపంలోని మై రెస్టారెంట్‌లో అధికారులు 30 కిలోల నిల్వ ఆహార పదార్థాలను గుర్తించారు.
...ఇలా నగరంలోని ఏ హోటల్, రెస్టారెంట్‌లో ఆహార భదత్ర, ప్రమాణాల శాఖ అధికారులు తనిఖీ చేసినా నిల్వ ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. రోజుల తరబడి నిల్వ ఉన్న ఆహారాన్ని నిర్వాహకులు వేడి చేసి వినియోగదారులకు వడ్డిస్తూ వారి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నా, కేసులు నమోదుచేస్తున్నా వారి తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు.
దాడులు చేసినా మారని తీరు..
నగర పరిధిలో పెద్ద, చిన్నా కలిపి సుమారు వెయ్యికిపైగా రెస్టారెంట్లు, హోటళ్లు ఉంటాయి. వీటిని ఆహార భదత్ర, ప్రమాణాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. నిల్వ చేసిన ఆహార పదార్థాలను గుర్తిస్తున్నారు. వారిపై కేసు నమోదుచేసి, జరిమానాలు విధిస్తున్నారు. అయినప్పటికీ హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకుల్లో ఎటువంటి మార్పు ఉండడం లేదు. నిల్ల ఆహారం విక్రయించే హోటళ్లు, రెస్టారెంట్ల అనుమతులను రద్దు చేస్తే తప్ప మార్పు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కానీ, అధికారులకు అనుమతులు రద్దు చేసే అధికారం లేదు. అందుకే, పెద్దగా ఫలితం ఉండడం లేదు. ఇక అధికారులు తనిఖీలు చేసిన ప్రతి సందర్భంలో పెద్దఎత్తున నిల్వ ఆహారం బయటపడు తున్నప్పటికీ వినియోగదారులు పట్టించుకోవడం లేదు. ఆ హోటళ్లలో తినడానికి వెనుకాడడం లేదు.
తీవ్ర అనారోగ్య సమస్యలు..
రోజుల తరబడి నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నాన్‌వెజ్ ఐటమ్స్‌ను రోజుల తరబడి నిల్వ చేయడం వల్ల ప్రొటీన్ నాణ్యత తగ్గుతుంది. దీనివల్ల టైఫాయిడ్‌తోపాటు డయేరియా బారినపడే అవకాశం ఉంది. అలాగే, తీవ్రమైన కడుపునొప్పి, అల్సర్లు వంటి ఇబ్బందులు వేధించే అవకాశం ఉంది. ఇంకా టేస్టింగ్ సాల్ట్, కొన్నిరకాల రంగులు వినియోగంతో లివర్ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టేస్టింగ్ సాల్ట్ వినియోగించిన ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయంతోపాటు కిడ్నీ సంబంధిత ఇబ్బందులు ఉత్పన్నమవుతాయని కేజీహెచ్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ గిరినాథ్ తెలిపారు. ప్రజలు బయట ఆహారానికి దూరంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లల్లో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని హెచ్చరించారు.