Share News

జ్వరాలబారిన హాస్టల్‌ విద్యార్థులు

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:37 AM

స్థానిక గాంధీగ్రామంలోని సాంఘిక సంక్షేమ శాఖ (ఎస్సీ) బాలుర వసతిగృహంలో పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. దీంతో హాస్టల్‌ వార్డెన్‌ సమాచారం ఇవ్వడంతో వైద్య సిబ్బంది వచ్చి సేవలు అందిస్తున్నారు. జ్వరాల తీవ్రత కొంతమేర తగ్గినప్పటికీ నీరసంతో ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు విద్యార్థులకు వసతి కొరత తీవ్రంగా వుంది.

జ్వరాలబారిన హాస్టల్‌ విద్యార్థులు
హాస్టల్‌లో జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులు

చాలీచాలని వసతితో పాట్లు

రెండు గదుల్లో 44 మంది ఉండాల్సిన దుస్థితి

అభివృద్ధి పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్‌

చోడవరం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక గాంధీగ్రామంలోని సాంఘిక సంక్షేమ శాఖ (ఎస్సీ) బాలుర వసతిగృహంలో పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. దీంతో హాస్టల్‌ వార్డెన్‌ సమాచారం ఇవ్వడంతో వైద్య సిబ్బంది వచ్చి సేవలు అందిస్తున్నారు. జ్వరాల తీవ్రత కొంతమేర తగ్గినప్పటికీ నీరసంతో ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు విద్యార్థులకు వసతి కొరత తీవ్రంగా వుంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండున్నర నెలలు కావవస్తున్నప్పటికీ వేసవిలో చేపట్టిన హాస్టల్‌ భవనం అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో 44 మంది విద్యార్థులు రెండు గదుల్లోనే సర్దుకుపోవాల్సి వస్తున్నది. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా వైరల్‌ జ్వరాలు ప్రబలాయి. ఒక్కో గదిలో 20 మందికిపైగా విద్యార్థులు వుండాల్సి రావడంతో ఒకరు వైరల్‌ జ్వరం బారిన పడితే.. ఒకటి, రెండు రోజుల్లోనే మిగిలిన వారు కూడా జ్వరాలబారిన పడుతున్నారు. కాగా వసతిగృహంలో రెండు బ్లాకుల్లో ఒకదానిని పాక్షికంగాపూర్తి చేయగా, మిగిలిన బ్లాక్‌కు పైకప్పు వేయాల్సి ఉంది. మొదటి బ్లాకులో మూడు గదులు అందుబాటులో వున్నప్పటికీ ఒక గదిలో కాంట్రాక్టర్‌ నిర్మాణ సామగ్రి వుంచారు. దీంతో విద్యార్థులు రెండు గదుల్లోనే సర్దుకుపోతున్నారు. హాస్టల్‌ పరిసరాల్లో దోమల బెడద ఎక్కువగా ఉండడంతో రాత్రిపూట నిద్రపట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి హాస్టల్‌ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థుల కోరుతున్నారు.

Updated Date - Aug 25 , 2025 | 12:37 AM