Share News

పర్యాటకులకు గిరి పల్లెల్లో ఆతిథ్యం

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:58 PM

పర్యాటకంగా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో స్థానికంగా వసతి, భోజన సదుపాయాలు కల్పించేలా హోమ్‌ స్టే పేరిట ప్రత్యేక టూరిజం ప్రాజెక్టు అభివృద్ధికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. అందుకు గాను స్వదేశీ దర్శన్‌లో భాగంగా రూ.5 కోట్లతో ప్రాజెక్టును రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు.

పర్యాటకులకు గిరి పల్లెల్లో ఆతిథ్యం
హోమ్‌ స్టే కోసం సిద్ధం చేసిననమూనా ఇల్లు

హోమ్‌ స్టే పేరిట ప్రత్యేక టూరిజం ప్రాజెక్టు

జిల్లాలో అరకు, లంబసింగి, మారేడుమిల్లి క్లస్టర్లుగా అభివృద్ధి

స్వదేశీ దర్శన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రూ.5 కోట్లతో ప్రతిపాదనలు

134 గిరిజన సంప్రదాయ ఇళ్లను సిద్ధం చేసేందుకు ప్రణాళిక

జిల్లా వ్యాప్తంగా రెండు వేల గదులు సిద్ధం చేయాలని సీఎం ఆదేశం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పర్యాటకంగా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో స్థానికంగా వసతి, భోజన సదుపాయాలు కల్పించేలా హోమ్‌ స్టే పేరిట ప్రత్యేక టూరిజం ప్రాజెక్టు అభివృద్ధికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. అందుకు గాను స్వదేశీ దర్శన్‌లో భాగంగా రూ.5 కోట్లతో ప్రాజెక్టును రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందని, ఇప్పటికే దానిపై సూత్రపాయ అంగీకారాన్ని కేంద్రం తెలిపిందని అధికారులు అంటున్నారు.

మన్యంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులు స్థానికంగా గిరిజన పల్లెల్లోనే బస చేసి వారి జీవన విధానాన్ని కళ్లారా చూడాలని ఆశిస్తుంటారు. గిరిజన పల్లెలు సైతం వారికి ఆకర్షణీయంగా ఉండడంతో అక్కడ బస చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో అటువంటి సందర్శకులకు గిరిజనులు తమ ఇళ్లల్లోనే వసతి ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక రుచులు, వారికి ఇష్టమైన రుచులతో వంటకాలు చేసి పర్యాటకులు అందిస్తారు. దీంతో మన్యంలో పర్యటించే సందర్శఽకులకు ప్రకృతి అందాలతో పాటు గిరిజన పల్లెల్లో స్థితిగతులను స్వయంగా తిలకించామనే అనుభూతి కలుగుతుంది. ఇదే క్రమంలో స్థానిక గిరిజనులకు ఉపాధి, ఆదాయం సైతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికులకు ఆదాయం, పర్యాటకులకు ఆనందం హోమ్‌స్టే టూరిజం ద్వారా సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు. ఇందులో భాగంగా అరకులోయ, లంబసింగి, మారేడుమల్లి ప్రాంతాలను క్లస్టర్లుగా గుర్తించి మొత్తం 134 గదులతో ప్రత్యేక హోమ్‌ స్టే టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అధికారులు రూ.5 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు చేశారు. అందుకు కేంద్ర టూరిజం అధికారులు సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని అఽధికారులు అంటున్నారు. ఆయా నిధులు మంజూరైతే ఎంపిక చేసిన 134 గదులను ప్రత్యేకంగా మెరుగుపరచడంతోపాటు ఆయా గ్రామాల్లోని సామాజిక అవసరాలను సైతం ఈ ప్రాజెక్టులోనే తీర్చేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఒక వైపు పర్యాటకంతో పాటు గిరిజన పల్లెల్లో సైతం మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా చూస్తున్నారు.

రెండు వేల గదులు సిద్ధం చేయాలని సీఎం ఆదేశం

గిరిజన ప్రాంతంలో హోమ్‌ స్టే టూరిజంలో భాగంగా రెండు వేల గదులను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు హోమ్‌ స్టే కోసం ఇళ్ల ఎంపికకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని మొత్తం 22 మండలాల్లో 15 మండలాల్లోని 171 గ్రామాల్లో 1,083 ఇళ్లను ఇప్పటికే ఎంపిక చేశారు. ఆయా ఇళ్ల యజమానులైన గిరిజన లబ్ధిదారులకు పీఎం జన్‌మన్‌ పథకంలో కొత్త ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో కొత్త ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు చెందిన పాత ఇళ్లను హోమ్‌ స్టేకు వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ఎంపిక చేసిన ఇళ్లను జిల్లా పర్యాటకాధికారి జి.దాసు ఆధ్వర్యంలో ఏపీ టూరిజం ఆర్కిటెక్చర్‌ నిషితాగోయల్‌, ఇంజనీరింగ్‌ అధికారి రాము బృందం ఇప్పటికే పరిశీలించి, అందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేశారు. అలాగే హోమ్‌ స్టే టూరిజంపై హోటళ్ల యజమానులు, యువత, ఎంపిక చేసిన గిరిజనులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర టూరిజం శాఖాధికారులు ఈ నెల 9న అరకులోయలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే హోమ్‌ స్టే టూరిజం ప్రాజెక్టును మంజూరు చేసే ముందు జిల్లాలో హోమ్‌ స్టేపై అందరికీ అవగాహన, చైతన్యం, నిర్వహణపై ముందడుగు వేసేందుకు టూరిజం అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Sep 16 , 2025 | 11:58 PM