Share News

ఆస్పత్రుల సమ్మె విరమణ

ABN , Publish Date - Nov 01 , 2025 | 01:30 AM

ఎన్టీఆర్‌ వైద్య సేవ పరిధిలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు శుక్రవారం సమ్మె విరమించాయి.

ఆస్పత్రుల సమ్మె విరమణ

యథావిధిగా ఎన్టీఆర్‌ వైద్య సేవలు

విశాఖపట్నం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):

ఎన్టీఆర్‌ వైద్య సేవ పరిధిలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు శుక్రవారం సమ్మె విరమించాయి. బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో జిల్లాలో ఎన్టీఆర్‌ వైద్య సేవ నెట్‌వర్క్‌ పరిధిలో గల 35కు పైగా ఆస్పత్రులు అక్టోబరు పదో తేదీ నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అత్యవసరం మినహా అన్నీ సేవలను నిలిపివేశాయి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఆస్పత్రుల అసోసియేషన్‌ ప్రతినిధులతో శుక్రవారం చర్చలు జరిపింది. బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో పాటు తక్షణమే రూ.250 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మెను విరమిస్తున్నట్టు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. రోగుల ఇబ్బందుల దృష్ట్యా నెట్‌వర్క్‌ హాస్పటల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో ప్రభుత్వం సంప్రతింపులు చేసి సమ్మె విరమింపజేసిందని జిల్లా ఎన్టీఆర్‌ వైద్య సేవ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.అప్పారావు తెలిపారు.


మత్స్యకారులకు నేటి నుంచి సరుకులు

విశాఖపట్నం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):

మొంథా తీవ్ర తుఫాన్‌ కారణంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లలేకపోయిన 12,995 మంది మత్స్యకారులకు శనివారం నుంచి సరుకులు పంపిణీ చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ తెలిపారు. ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల బియ్యం, కిలో చొప్పున పంచదార, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటరు పామాయిల్‌ రేషన్‌ డిపోల వద్ద పంపిణీ చేస్తామన్నారు. మత్స్యకారులు బియ్యం కార్డులో నమోదైన రేషన్‌ డిపోలకు వెళ్లి బయోమెట్రిక్‌ వేసి ఆధార్‌ కార్డు ద్వారా సరుకులు తీసుకోవాలన్నారు. ఇంకా తుఫాన్‌ సమయంలో సహాయ శిబిరాల్లో ఉన్న 181 మందికి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలోవంతున పంచదార, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటరు పామాయిల్‌ డిపోల వద్ద పంపిణీ చేస్తామన్నారు. రేషన్‌ దుకాణాలకు బియ్యం, ఇతర సరుకులు సరఫరా చేశామని, రెవెన్యూ సిబ్బంది, ప్రత్యేక అధికారులు పంపిణీలో అంతరాయం లేకుండా పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు.


అరకు, పాడేరు బస్సుల పునరుద్ధరణ

ద్వారకా బస్‌స్టేషన్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):

అరకులోయ, పాడేరు రూట్లలో బస్సులను ఆర్టీసీ విశాఖ రీజియన్‌ అధికారులు శుక్రవారం నుంచి పునరుద్ధరించారు. తుఫాన్‌ కారణంగా ఈ రెండు రూట్‌లలో బస్సులను సోమవారం నుంచి రద్దు చేసిన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గడంతో గురువారం ఆర్టీసీ అధికారులు, సివిల్‌ ఇంజనీర్లు ఆ రూట్‌లలో సర్వే నిర్వహించారు. ఎటువంటి ఇబ్బందులు లేవని నిర్ధారించుకుని శుక్రవారం బస్సులను ఆపరేట్‌ చేయడం ప్రారంభించారు. తుఫాన్‌కు ముందు ఈ రెండు రెండు రూట్‌లలోను ప్రతిరోజూ 20 షెడ్యూల్స్‌ నడిచాయి. శుక్రవారం పది సర్వీసులు నడిపారు. శనివారం మరో పది సర్వీసులు జోడించనున్నారు.

Updated Date - Nov 01 , 2025 | 01:30 AM