ఘోరం
ABN , Publish Date - Dec 29 , 2025 | 12:47 AM
విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
చెట్టును ఢీకొట్టిన వ్యాన్
ఇద్దరు నగర వాసులు మృతి
విజయనగరం జిల్లా గజపతినగరంలో ప్రమాదం
రాయగడ నుంచి వస్తున్న వ్యాపారి, డ్రైవర్
కంచరపాలెంలో విషాదం
గజపతినగరం/ కంచరపాలెం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. రాయగడ నుంచి వస్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్‌డ్రైవర్‌తో పాటు వాహన యజమాని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
విశాఖపట్నంలోని కంచరపాలెం బర్మాకాలనీకి చెందిన వ్యాపారి పొట్నూరు వినయ్‌కుమార్ (35), డ్రైవర్ యల్లబిల్లి దినేష్(24) కంచరపాలెం నుంచి శనివారం వ్యాన్‌లో వినయ్‌కుమార్ స్నేహితుని షాపు ప్రారంభోత్సవానికి రాయగడ బయలుదేరారు. గజపతినగరంలో సాయంత్రం హోల్‌సేల్ కిరణా షాపునకు వెళ్లి అక్కడ కొన్ని సరకులు కొనుగోలు చేశారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున గజపతినగరం మండలం మదుపాడ జంక్షన్ దాటి రైల్వేస్టేషన్ సమీపానికి వచ్చేసరికి వ్యాన్ అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ ప్రమాదానికి కారణాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందజేసి వారి సమక్షంలో వ్యాన్‌లో చిక్కుకున్న మృతదేహాలను క్రేన్ సహాయంతో బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. వ్యాపారి వినయ్‌కుమార్ పదేళ్లుగా బేకరీలకు చాక్లెట్‌లు, బిస్కట్‌లు, చేగొడియాలు సరఫరా చేస్తుంటాడు. ఇతడికి భార్య వాసవి, పిల్లలు లాస్యక, జయదీప్ ఉన్నారు. డ్రైవర్ యల్లబిల్లి దినేష్‌కు ఐదేళ్లకిందట వివాహం జరిగింది. భార్య లయ, పిల్లలు లతిక (3), మాన్విక్ (8 నెలలు). దినేష్ తల్లి యల్లబిల్లి శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
శోకసంద్రంలో కంచరపాలెం
జైభారత్‌నగర్, పట్టాభిరెడ్డి తోట ప్రాంతాలకు చెందిన దినేష్, వినయ్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. దినేష్ కంచరపాలెం సమీపంలోని జైభారత్‌నగర్‌కు చెందినవాడు. తల్లిదండ్రులు దుర్గ, కనకమ్మ జీవీఎంసీలో పారిశుధ్యం పనులు చేస్తుంటారు. దినేష్ మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దినేష్ భార్య లయను ఓదార్చడం ఎవరుతరం కావడం లేదు. పొట్నూరు వినయ్ పట్టాభిరెడ్డి తోటలో బేకరీ నడుపుతుంటాడు.