ఘోరం
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:41 AM
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం బలంగా ఢీకొనడంతో దంపతులతో సహా వారి 11 ఏళ్ల కుమార్తె మృత్యువాతపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు వారి కుమార్తె మృతి
సింహాచలం గోశాల సమీపంలో సంఘటన
పెందుర్తి/వేపగుంట, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం బలంగా ఢీకొనడంతో దంపతులతో సహా వారి 11 ఏళ్ల కుమార్తె మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నగర పరిధిలోని సింహాచలం గోశాల పద్మావతి నగర్ వాసుదేవ ఫంక్షన్ హాల్ ఎదురుగా బీఆర్‌టీఎస్ రోడ్డులో జరిగింది. పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన పొన్నాడ కాంతారావు (45), ఆయన భార్య సంధ్య (42), కుమార్తె మహేశ్వరి (11), కుమారుడు గురునాథరావు (14)... ఉపాధి నిమిత్తం రెండు నెలల కిందట వలస వచ్చి సింహాచలం టీవీ టవర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాంతారావు గతంలో హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేసేవారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో వచ్చేశారు. ప్రస్తుతం తాత్కాలికంగా సింహాచలంలోని ఓ మెడికల్ దుకాణంలో పనిచేస్తూ, రేపిడో నడుపుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం కుమారుడిని ఇంటి వద్దే ఉంచి కుమార్తె మహేశ్వరితో కలిసి దంపతులు ఇద్దరూ రాత్రి 7.30 గంటల సమయంలో గోశాల నుంచి పల్సర్ బైక్‌పై బీఆర్‌టీఎస్ సెంటర్ రోడ్డులో వెళుతున్నారు. సరిగ్గా వీరి వాహనం పద్మావతి నగర్ వసుదేవ ఫంక్షన్‌హాల్ వద్దకు వచ్చేసరికి, కేంద్ర కారాగారంలో స్టెనోగా పనిచేస్తున్న చైతన్య తన బుల్లెట్ వాహనంపై అతివేగంగా అదేరోడ్డులో ఎదురువస్తూ కారును ఓవర్‌టేక్ చేశాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కాంతారావు బైక్‌ను బలంగా ఢీకొన్నాడు. దీంతో బైక్ డివైడర్ పైకి దూసుకుపోయి, కాంతారావు తుళ్లిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో అతని భార్య సంధ్య, కుమార్తె మహేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ సంధ్య, మహేశ్వరి మృతిచెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా మరో బైక్‌పై వస్తున్న చైతన్య స్వల్పంగా గాయపడ్డాడు.