Share News

మెడికల్‌ షాపు యజమాని నిజాయితీ

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:45 PM

రోడ్డుపై ఏమైనా వసువులు పోగుట్టుకుంటే ఇక అవి పోయినట్టేనని భావించే ఈ రోజుల్లో ఓ వ్యక్తి ఏకంగా తనకు దొరికిన రూ.3.60 లక్షలు ఉన్న బ్యాగును ఎంతో నిజాయితీగా పోలీసులకు అప్పగించిన సంఘటన గాజువాకలో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అభినందించడమే కాకుండా నగదు పోగొట్టుకున్న వ్యక్తికి ఆ నగదును అప్పగించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మెడికల్‌ షాపు యజమాని నిజాయితీ
బాధితుడు షణ్ముఖరావుకు నగదు అందజేస్తున్న శివకుమార్‌. చిత్రంలో సీఐ పార్థసారథి, తదితరులు ఉన్నారు

రోడ్డుపై దొరికిన రూ.3.60 లక్షలతో కూడిన బ్యాగును పోలీసులకు అప్పగించిన వైనం

అభినందించిన సీఐ పార్థసారథి

గాజువాక, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): రోడ్డుపై ఏమైనా వసువులు పోగుట్టుకుంటే ఇక అవి పోయినట్టేనని భావించే ఈ రోజుల్లో ఓ వ్యక్తి ఏకంగా తనకు దొరికిన రూ.3.60 లక్షలు ఉన్న బ్యాగును ఎంతో నిజాయితీగా పోలీసులకు అప్పగించిన సంఘటన గాజువాకలో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అభినందించడమే కాకుండా నగదు పోగొట్టుకున్న వ్యక్తికి ఆ నగదును అప్పగించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 15వ తేదీన పారిశ్రామిక ప్రాంతంలోని యాదవ జగ్గరాజుపేట ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు వ్యాన్‌ డ్రైవర్‌ అయిన ఎం.షణ్ముఖకుమార్‌ గాజువాకలోని ఓ బ్యాంకులో రూ.3.60 లక్షలు డ్రా చేసి బ్యాగులో పెట్టుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఆ బ్యాగు ఎక్కడో పడిపోయింది. ఇంటికి వెళ్లి చూసేసరికి నగదుతో ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అదేరోజు ఆటోనగర్‌ వద్ద గాజువాకకు చెందిన కొర్ల శివకుమార్‌ అనే మెడికల్‌ షాపు యజమానికి ఆ బ్యాగు దొరికింది. అందులో అధిక మొత్తంలో నగదు ఉండడంతో ఆయన ఎంతో నిజాయితీగా దానిని తీసుకువెళ్లి గాజువాక పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో గురువారం షణ్ముఖకుమార్‌ నగదుతో కూడిన తన బ్యాగు పోయిందంటూ పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలుసుకున్నాక సీఐ పార్థసారథి ఆ బ్యాగు షణ్ముఖకుమార్‌దేనని నిర్ధారించుకున్నారు. ఈ మేరకు శివకుమార్‌ను పోలీస్‌ స్టేషన్‌కు రప్పించి ఆయన చేతుల మీదుగానే రూ.3.60 లక్షల నగదును షణ్ముఖరావుకు సీఐ అప్పగించారు. ఎంతో నిజాయితీతో వ్యవహరించిన శివకుమార్‌ను సీఐతో ఇతర సిబ్బంది అభినందించారు. పోయిందనుకున్న నగదు తిరిగి లభ్యం కావడంతో షణ్ముఖరావు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు శివకుమార్‌కు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 17 , 2025 | 11:45 PM