Share News

సాగని పేదల ఇళ్ల పనులు

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:40 AM

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా వున్న పేదల గృహ నిర్మాణాలు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం అదనపు సాయం అందించింది. కొందరు లబ్ధిదారులు ఇంటి పనులు పూర్తి చేసేందుకు ముందుకు రాకపోవడంతో అధికారులు శాఖాపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ సాయం నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయినా ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారికి గృహ నిర్మాణ సంస్థ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. గడువులోగా ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయకపోతే అదనపు సాయం డబ్బులను వెనక్కు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

సాగని పేదల ఇళ్ల పనులు
. సబ్బవరం మండలం అసకపల్లిలో నత్తనడకన గృహనిర్మాణ పనులు

ప్రభుత్వం అదనపు సాయం అందించినా కదలిక లేని వైనం

వైసీపీ హయాంలో అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణం

నాటి ప్రభుత్వం ఇచ్చిన నిధులు చాలకపోవడంతో మధ్యలో ఆపేసిన లబ్ధిదారులు

అదనపు సాయం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం

తొలి విడత 5,797 ఇళ్లకు రూ.7.35 కోట్లు మంజూరు

మార్చిలోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ

ఇంతవరకు పూర్తికాని ఇళ్ల నిర్మాణం

నోటీసులు జారీ చేస్తున్న అధికారులు

పనులు చేపట్టని వారి నుంచి సొమ్ము రికవరీకి సిద్ధం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా వున్న పేదల గృహ నిర్మాణాలు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం అదనపు సాయం అందించింది. కొందరు లబ్ధిదారులు ఇంటి పనులు పూర్తి చేసేందుకు ముందుకు రాకపోవడంతో అధికారులు శాఖాపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ సాయం నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయినా ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారికి గృహ నిర్మాణ సంస్థ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. గడువులోగా ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయకపోతే అదనపు సాయం డబ్బులను వెనక్కు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత అనకాపల్లి జిల్లా పరిధిలో పేదలకు సొంత ఇళ్ల నిర్మాణం కోసం 685 లేఅవుట్‌లు వేసి 58 వేల పైచిలుకు ఇళ్లను మంజూరు చేసింది. కొన్ని గ్రామాల్లో కొండవాలు ప్రదేశాలు, నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలు, గెడ్డ వాగుల పక్కన లేఅవుట్‌లు వేయడంతో చాలామంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు. కొంతమంది ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. అప్పట్లో ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.1.8 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. ఈ నిధులు చాలకపోవడంతో అనేకమంది పనులు మధ్యలోనే ఆపేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణ పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అదనపు సాయాన్ని మంజూరు చేసింది. తొలి దశలో 5,797 అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు నివేదిక ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఎస్సీ, బీసీ లబ్ధిరులకు రూ.50 వేల చొప్పున, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేల చొప్పున మొత్తం రూ.7.35 కోట్లు మంజూరు చేసింది. గత మార్చి నెలలో ఈ సొమ్ము ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. కానీ ఇంతవరకు చాలాకొద్ది ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం 5,797 ఇళ్లకుగాను 3,115 మంది మాత్రమే ఇంతవరకు పనులు మొదలుపెట్టారు. మిగిలిన 2,682 మంది పనులు ప్రారంభించలేదు. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా.. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయడంలేదు. ప్రభుత్వం అందించిన అదనపు సాయాన్ని కొంతమంది సొంతానికి వినియోగించుకున్నట్టు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంతవరకు పనులు ప్రారంభించని 2,682 మందిలో 850 మందికి గృహ నిర్మాణ సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. మిగిలిన వారికి కూడా ఒకటి, రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నారు. అంతే కాక ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయకపోతే నిధులు రికవరీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనిపై జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ శ్రీనివాసరావును ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరగా.. ఇళ్ల నిర్మాణ పనులు మొదలుపెట్టని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తున్న మాట వాస్తవమేనన్నారు. తొలి దశలో ఎంపిక చేసిన ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయితేనే రెండో దశ ఇళ్ల లబ్ధిదారులకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 12:40 AM