పర్యాటకులకు హోమ్ స్టే
ABN , Publish Date - May 13 , 2025 | 01:12 AM
విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు ‘ఇంటిలో ఆతిథ్యం’ ఇవ్వాలనుకునేవారు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు పిలుపునిచ్చారు.

రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పర్యాటక శాఖ పిలుపు
కనీసం ఒక గది నుంచి ఆరు గదుల వరకూ అన్ని వసతులతో పర్యాటకులకు అందించగలిగేవారు
పేర్లు నమోదు చేయించుకోవచ్చు
ఆసక్తి కలిగిన వారికి త్వరలో అవగాహన కార్యక్రమం
విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు ‘ఇంటిలో ఆతిథ్యం’ ఇవ్వాలనుకునేవారు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు పిలుపునిచ్చారు. ఎవరికైనా సొంత ఇల్లు/విల్లా/అపార్టుమెంట్ ఫ్లాట్ ఉండి, వాటిని పర్యాటకులకు రోజువారీ పద్ధతిలో అద్దెకు ఇవ్వడానికి ఆసక్తి ఉంటే పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా పర్యాటక శాఖాధికారిణి జె.మాధవి సూచించారు.
హోమ్ స్టే అంటే...
పర్యాటకులకు అన్ని ప్రాంతాల్లోను హోటళ్లలో గదులు లభించవు. అలాగే తినడానికి ఆహారం కూడా దొరకదు. చాలామంది పర్యాటకులు స్థానికంగా లభించే ఆహార పదార్థాలను రుచి చూడాలనుకుంటారు. అక్కడి మనుషులతో మాట్లాడి, సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, దుస్తులు, స్థానిక కళల గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఇవన్నీ సాధారణ హోటళ్లలో లభించవు. అటువంటి అభిరుచి కలిగిన వారికి స్థానిక విధానంలో ‘వసతి సౌకర్యాలు’ కల్పించడాన్ని ‘హోమ్ స్టే’గా వ్యవహరిస్తున్నారు. కశ్మీర్, పంజాబ్ వంటి రాషా్ట్రలతో పాటు మలేషియా వంటి దేశాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఈ హోమ్ స్టే బాగా ఆదరణ పొందింది. దీనివల్ల స్థానికులకు కూడా ఉపాధి లభిస్తోంది. వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రచారం పెరుగుతోంది. ప్రభుత్వాలపై ఒత్తిడి తగ్గుతోంది. రాష్ట్రాలకు వచ్చే పర్యాటకులకు అవసమైనన్ని గదులు పర్యాటక, ప్రైవేటు సంస్థలు సమకూర్చలేకపోతున్నాయి.
ఈ హోమ్ స్టే వల్ల పర్యాటకంగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో స్థానికులే వారి గృహాలను అందంగా అలంకరించి, వాణిజ్య ధరల కంటే తక్కువకే వసతి కల్పించడం, ఇంట్లో వండిన ఆహార పదార్థాలను ఆప్యాయంగా వడ్డించడం వల్ల పర్యాటకుల సంతృప్తి శాతం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని నూతన పర్యాటక పాలసీలో చేర్చింది. కనీసం ఒక గది నుంచి ఆరు గదుల వరకు అన్ని వసతులతో పర్యాటకులకు అందించగలిగేవారు పేర్లు నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్థ (ఏపీటీఏ) వెబ్‌సైట్‌లో ఎవరికి వారే వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 0891-2754716 నంబరులో సంప్రతించాలని జె.మాధవి సూచించారు. కొద్దిరోజులు గడిచాక ఆసక్తి కలిగిన వారిని పిలిచి అవగాహన సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. విధి విధానాలు తెలియజేస్తామని, పర్యాటకులే నేరుగా ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడి హోమ్ స్టేను ఎంపిక చేసుకుంటారని వివరించారు.