పనిచేసిన ఇంటికే కన్నం
ABN , Publish Date - Oct 16 , 2025 | 10:18 PM
తాను పని చేస్తున్న ఇంట్లోనే దొంగతనం చేసిన మహిళతో పాటు ఆమెకు సహకరించిన సోదరిని దువ్వాడ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రెండున్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ ఎస్‌ఐ నరసింహులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మహిళతో పాటు ఆమెకు సహకరించిన సోదరి అరెస్టు
కూర్మన్నపాలెం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): తాను పని చేస్తున్న ఇంట్లోనే దొంగతనం చేసిన మహిళతో పాటు ఆమెకు సహకరించిన సోదరిని దువ్వాడ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రెండున్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ ఎస్‌ఐ నరసింహులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 86వ వార్డు రాజీవ్ నగర్‌లో నివాసం ఉంటున్న వి.నరసింగరావు ఇంట్లో అనకాపల్లి జిల్లా సోమలింగపురానికి చెందిన కె.నాగమణి పని చేసేది. ఈ నెల ఒకటిన నరసింగరావు కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేని సమయంలో బీరువా తెరిచి బంగారు చెవిదిద్దులు, పచ్చల హారాన్ని నాగమణి తస్కరించింది. వాటిని తన చెల్లి మంగకు ఇచ్చి విక్రయించాలని చెప్పింది. చోరీ జరిగిన విషయాన్ని ఆలస్యంగా గమనించిన నరసింగరావు దువ్వాడ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాగమణిని విచారించడంతో ఆమె నేరం అంగీకరించింది. ఈ మేరకు అక్కాచెల్లెళ్లను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.