పర్యాటక సీజన్ నాటికి హోమ్ స్టేలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:56 PM
ఈ ఏడాది పర్యాటక సీజన్ నాటికి సందర్శకులకు హోమ్ స్టేలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపట్టాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
‘మేడ్ ఇన్ అరకు’ ఉత్పత్తుల విక్రయాలకు ఏర్పాట్లు చేయాలని సూచన
పాడేరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది పర్యాటక సీజన్ నాటికి సందర్శకులకు హోమ్ స్టేలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. జిల్లాలో పర్యాటకంపై కలెక్టరేట్ నుంచి అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో హోమ్ స్టేలకు సంబంధించిన పనులను సత్వరమే చేపట్టాలని, పర్యాటక ప్రాంతాల్లో ‘మేడ్ ఇన్ అరకు’ ఉత్పత్తులు విక్రయించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు గిరిజన గ్రామాల్లో రాత్రి బస చేయడానికి అనువుగా ఉండేలా హోమ్ స్టేలను అభివృద్ధి చేయాలన్నారు. జిల్లాలో అరకులోయ, లంబసింగి, మారేడుమిల్లి వంటి పర్యాటక ప్రాంతాల్లో హోమ్ స్టేలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎంపీడీవోలు గుర్తించిన గ్రామాలను సందర్శించి పర్యాటక ఆతిథ్యంపై స్థానికులకు శిక్షణ అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతానికి అరకులోయలో 91, చింతపల్లిలో 30 హోమ్ స్టేలు గుర్తించారని, వాటిని పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేయాలని తెలిపారు. జాతీయ రహదారిలో అటు రంపచోడవరం నుంచి ఇటు అనంతగిరి వరకు గిరిజన ఉత్పత్తులు విక్రయించేందుకు భూమిని గుర్తించాలని అధికారులకు సూచించారు. టూరిజం కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సందర్శకులకు పర్యాటక రంగంపై అవగాహన కల్పించేందుకు సైన్ బోర్డులు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని, అరకు చలి ఉత్సవాలకు ముందుగానే ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, స్థానిక ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ, క్యూరేటర్ శంకరరావు, జిల్లాలోని 22 మండలాలకు చెందిన ఎంపీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.