Share News

వాటర్‌ ట్యాంకు నిర్మాణంపై హోం మంత్రి ఆగ్రహం

ABN , Publish Date - Nov 13 , 2025 | 01:08 AM

మండలంలోని పెట్టుగోళ్లపల్లి గ్రామంలో జల్‌జీవన్‌ పథకం పనుల్లో భాగంగా నూతనంగా నిర్మించిన వాటర్‌ ట్యాంకు మెట్ల మార్గం కింద భాగంలో పెచ్చులూడడం, లీకేజీ రావడంపై హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆ వాటర్‌ ట్యాంకును ప్రారంభించడానికి వచ్చిన ఆమె నాసిరకం నిర్మాణంపై అసహనం వ్యక్తం చేసి కాంట్రాక్టర్‌పై మండిపడ్డారు.

వాటర్‌ ట్యాంకు నిర్మాణంపై హోం మంత్రి ఆగ్రహం
పెట్టుగోళ్లపల్లిలో వాటర్‌ ట్యాంకు నిర్మాణ కాంట్రాక్టర్‌పై మండిపడుతున్న హోం మంత్రి అనిత

- నాసిరకంగా నిర్మించిన కాంట్రాక్టర్‌పై మండిపాటు

- ప్రారంభించకుండానే వెనుదిరిగిన వైనం

ఎస్‌.రాయవరం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెట్టుగోళ్లపల్లి గ్రామంలో జల్‌జీవన్‌ పథకం పనుల్లో భాగంగా నూతనంగా నిర్మించిన వాటర్‌ ట్యాంకు మెట్ల మార్గం కింద భాగంలో పెచ్చులూడడం, లీకేజీ రావడంపై హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆ వాటర్‌ ట్యాంకును ప్రారంభించడానికి వచ్చిన ఆమె నాసిరకం నిర్మాణంపై అసహనం వ్యక్తం చేసి కాంట్రాక్టర్‌పై మండిపడ్డారు.

జల్‌జీవన్‌ పథకంలో భాగంగా కోట్లాది రూపాయల నిధులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తుంటే, నాసిరకం పనులతో నిర్లక్ష్యంగా వాటర్‌ ట్యాంకు నిర్మిస్తారా? అని కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాన్ని ప్రారంభించకుండా వెనుదిరగడం ఇదే తొలిసారని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ట్యాంకు నిర్మాణం చక్కగా చేపట్టిన తరువాతే ప్రారంభిస్తానన్నారు. వాటర్‌ ట్యాంకు నిర్మాణ నాణ్యతపై కలెక్టర్‌తో పాటు సంబంధిత మంత్రికి కూడా ఫిర్యాదు చేశానని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ అల్లు వెంకట ప్రశాంతి, నరసింహమూర్తి దంపతులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, నియోజకవర్గ కన్వీనర్‌ కొప్పిశెట్టి వెంకటేష్‌, జనసేన నియోజకవర్గ నాయకుడు గెడ్డం బుజ్జి, మాజీ ఎంపీపీ వినోద్‌రాజు, టీడీపీ మండల అధ్యక్షుడు అమలకంటి అబద్దం, పీఏసీ చైర్‌పర్సన్‌లు తుమ్మపాల నాగేశ్వరరావు, గుర్రం రామకృష్ణ, నాయకులు పల్లెల జగ్గారావు, భీమరశెట్టి శ్రీనివాసరావు, కోనా అప్పలరాజు, అల్లు మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 01:09 AM