Share News

ఖైదీలకు రాఖీ కట్టిన హోంమంత్రి అనిత

ABN , Publish Date - Aug 10 , 2025 | 01:08 AM

రక్షాబంధన్‌ సందర్భంగా రాష్ట్రహోంశాఖా మంత్రి వంగలపూడి అనిత శనివారం కేంద్ర కారాగారానికి వెళ్లి ఖైదీలతోపాటు జైలు సిబ్బందికి రాఖీలు కట్టారు.

ఖైదీలకు రాఖీ కట్టిన హోంమంత్రి అనిత

విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి):

రక్షాబంధన్‌ సందర్భంగా రాష్ట్రహోంశాఖా మంత్రి వంగలపూడి అనిత శనివారం కేంద్ర కారాగారానికి వెళ్లి ఖైదీలతోపాటు జైలు సిబ్బందికి రాఖీలు కట్టారు. 30 మంది ఖైదీలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. యువత మంచిచెడులు తెలుసుకుని ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. యువ ఖైదీలతో మాట్లాడుతూ గంజాయి రవాణా చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవుపలికారు. బతకడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకుని జీవితంలో పైకి రావాలని పిలుపునిచ్చారు. వచ్చే రాఖీపండుగను ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి జరుపుకునే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. జైలులోని అధికారులు, సిబ్బందికి కూడా రాఖీలు కట్టి సోదరభావాన్ని పంచుకున్నారు.


బదిలీ టీచర్లకు అందని జీతాలు

ఉమ్మడి జిల్లాలో 1,200మంది ఎదురుచూపు

ఇప్పటికి రెండు నెలలు పెండింగ్‌

విద్య, ఆర్థిక శాఖల మధ్య సమన్వయలోపమే కారణం

విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):

రెండు నెలల క్రితం బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో పలువురికి ఇంతవరకూ జీతాలు అందలేదు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి మేరకు కొత్తగా మంజూరుచేసిన పోస్టుల్లోకి వెళ్లినవారు ఉమ్మడి జిల్లాలో సుమారు 1,200 మంది ఉన్నారు. వారి జీతాల బిల్లుల అప్‌లోడ్‌కు అవసరమైన పొజిషన్‌ ఐడీల ఏర్పాటులో పాఠశాల విద్యా శాఖ, ఆర్థిక శాఖ మధ్య సమన్వయం కొరవడింది. దీంతో జూన్‌, జూలై జీతాలు అందలేదు. దీనిపై ఉపాధ్యాయులు రెండు నెలల నుంచి ఆందోళన వ్యక్తంచేస్తున్నా విద్యా శాఖ స్పందించడం లేదనే వాదన వినిపిస్తోంది.

జూన్‌ నెలలో ఉమ్మడి జిల్లాలో సుమారు ఐదు వేల మందిని బదిలీ చేశారు. ఆయా పాఠశాలల్లో ఉన్న పోస్టుల్లోకి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు జీతం విషయంలో ఇబ్బంది లేదు. సుమారు 3,800 మంది టీచర్లకు జీతాలు బట్వాడాలో సమస్యలు లేవు. అయితే గత ప్రభుత్వం అమలుచేసిన జీవో 117 రద్దు తరువాత తీసుకువచ్చిన జీవోల మేరకు పలు రకాల పాఠశాలలు ఏర్పాటుచేసి అక్కడ విద్యార్థుల సంఖ్య మేరకు టీచర్లను నియమించారు. దీనికితోడు కొన్నిచోట్ల అదనపు సెక్షన్లు ఏర్పాటుచేయడంతో అక్కడ కూడా పోస్టులు కేటాయించారు. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి మేరకు కొన్నిచోట్ల మిగిలిన టీచర్లను అవసరం ఉన్న చోట, కొత్తగా ఏర్పాటుచేసిన పాఠశాలలకు పంపించారు. దీనికి ఆర్థిక శాఖ నుంచి ముందుగా అనుమతి తీసుకోలేదు. అందువల్లే బదిలీపై నియమించిన టీచర్లకు జీతాలు బట్వాడాలో సమస్య ఉత్పన్నమైంది. జూన్‌ మూడో వారంలో ఈ సమస్య గుర్తించినా ఉన్నతస్థాయి నుంచి ఆదేశాల జారీకి తీవ్ర జాప్యం ఏర్పడింది. దీంతో ఆ నెల బిల్లులు అప్‌లోడ్‌ కాలేదు. సాధారణంగా నిర్ణీత గడువులోగా అప్‌లోడ్‌ చేయని బిల్లులు మరుసటి నెల అంటే జూలై ఆరు నుంచి పదో తేదీలోగా అప్‌లోడ్‌ చేయాలి. అయితే జీతం బిల్లు అప్‌లోడ్‌ చేయాలంటే ప్రతి టీచర్‌కు పొజిషన్‌ ఐడీ కేటాయించాల్సి ఉంది. గత నెలలో ఆ పనిచేయలేదు. నెలాఖరున అప్‌లోడ్‌కు పొజిషన్‌ ఐడీ సమస్య వచ్చింది. దీంతో జూలై నెల జీతం రాలేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 1,200 మంది టీచర్లు రెండు నెలల నుంచి జీతాలకు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని జీతాల విడుదలకు చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్‌ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి టీఆర్‌ అంబేద్కర్‌ కోరారు.


క్రాస్‌ఓటింగ్‌పై జనసేన పోస్టుమార్టం

స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో ఏడుగురు కార్పొరేటర్లు వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసినట్టు గుర్తింపు

అధిష్ఠానానికి నివేదిక

విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి):

కౌన్సిల్‌లో మెజారిటీ ఉన్నప్పటికీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో ఒక స్థానం కోల్పోవడంపై కూటమి పార్టీలు పోస్టుమార్టం ప్రారంభించాయి. వైసీపీ తరపున కార్పొరేటర్లుగా గెలిచి జనసేనలో చేరిన కొందరు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ కూటమి నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఆదేశాల మేరకు స్థానిక జనసేన నేతలు తమ కార్పొరేటర్ల ఓటింగ్‌పై ఆరా తీశారు. వైసీపీ నుంచి తమ పార్టీలో చేరిన 11 మందిలో ఏడుగురు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడినట్టు గుర్తించినట్టు ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఇండిపెండెంట్‌గా గెలిచి జనసేనలో చేరిన కార్పొరేటర్‌ ఒకరు...ఏడు ఓట్లు కూటమి అభ్యర్థులకు కాకుండా వైసీపీ నుంచి పోటీ చేసిన వారికి వేసినట్టు స్పష్టమైందన్నారు. అలాగే మరో ఆరుగురు కూడా వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసినట్టు గుర్తించామన్నారు. దీనిపై అధిష్ఠానానికి నివేదిక పంపిస్తామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు వారిపై చర్యలు ఉంటాయని వివరించారు.

Updated Date - Aug 10 , 2025 | 01:08 AM