Share News

సీనరేజ్‌ కాంట్రాక్ట్‌ కోసం పట్టు

ABN , Publish Date - Jul 28 , 2025 | 01:20 AM

ఉమ్మడి విశాఖ జిల్లాలో గనుల సీనరేజ్‌ వసూళ్ల కాంట్రాక్టు కోసం భారీగా పోటీ నెలకొంది.

సీనరేజ్‌ కాంట్రాక్ట్‌ కోసం పట్టు

  • ఉమ్మడి జిల్లాలో రూ.16 కోట్లకు టెండరు ఆహ్వానించిన గనులశాఖ

  • రంగంలోకి దిగిన ఇద్దరు కూటమి ప్రజాప్రతినిధులు

  • తమ వారికే బిడ్‌ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి

విశాఖపట్నం, జూలై 27 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విశాఖ జిల్లాలో గనుల సీనరేజ్‌ వసూళ్ల కాంట్రాక్టు కోసం భారీగా పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో ప్రతి నెలా గనుల లీజులు, తాత్కాలిక పర్మిట్లు, ఇతరత్రా జరిమానాల రూపంలో రూ.11 కోట్లు వసూలవుతుంది. దీనిని పరిగణనలోనికి తీసుకుని సీనరేజ్‌ వసూళ్ల కోసం నెలకు రూ.16 కోట్లకు టెండరు ఆహ్వానించింది. దీంతో ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాలతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లో సీనరేజ్‌ వసూలు చేస్తున్న సంస్థలతో పాటు మరో సంస్థ బిడ్లు వేసింది. ప్రభుత్వం ఇంకా వాటిని ఓపెన్‌ చేయలేదు. అయితే కూటమి ప్రభుత్వంలో కొందరు ప్రజాప్రతినిధులు తమ వారికే కాంట్రాక్టు దక్కేలా చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో కోస్తా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

జిల్లాలో ప్రభుత్వం అనుమతించిన క్వారీల్లో తవ్వకాలకు భిన్నంగా పలు రకాల గనులు తవ్వి తరలిస్తున్నారనే సమాచారంతో గత ప్రభుత్వం సీనరేజ్‌ వసూళ్ల బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. గనుల శాఖలో పరిమితంగా ఉన్న సిబ్బందితో సీనరేజ్‌ వసూళ్లతోపాటు అక్రమ క్వారీయింగ్‌ను అరికట్టలేమని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో గత ప్రభుత్వం అమలుచేసిన కాంట్రాక్టు విధానాన్ని కొనసాగించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ హయాంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కాంట్రాక్టులను రెండు సంస్థలకు అప్పగించింది. ఉమ్మడి విశాఖ జిల్లా టెండరును అప్పటి వైసీపీ నేతలు అడ్డుకోవడంతో విరమించుకుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం, గతంలో కాంట్రాక్టు ఇవ్వని జిల్లాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది.

అనకాపల్లి జిల్లా కీలకం..

ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో మెటల్‌, గ్రానైట్‌తోపాటు లేటరైట్‌ క్వారీలు ఉండగా, అల్లూరి జిల్లాలోని పాడేరు డివిజన్‌, విశాఖ జిల్లాలో తక్కువగా క్వారీలున్నాయి. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖ, పాడేరులో గనుల శాఖ ఏడీ కార్యాలయాలున్నాయి. ప్రభుత్వం నుంచి లైసెన్సులు తీసుకున్న క్వారీల నుంచి పూర్తిగా ఆదాయం రావడం లేదు. అనుమతి లేకుండా అనేక క్వారీల నుంచి వందల లారీల రాళ్లు, గ్రావెల్‌ తరలిపోతోంది. గ్రావెల్‌ మాఫియా ప్రతి నెలా రూ.కోట్ల విలువైన మట్టి, గ్రావెల్‌ను అనధికారికంగా తవ్వి, తరలిస్తోంది. అనకాపల్లి జిల్లాలో మెటల్‌ క్వారీల నుంచి ప్రతి రోజూ వందల లారీలతో బండరాళ్లను రాంబిల్లి వద్ద నేవల్‌ బేస్‌ నిర్మాణాల కోసం తరలిస్తున్నారు. వీరెవరూ ప్రభుత్వానికి పైసా చెల్లించడం లేదు. కాగా నాతవరం మండలం సరుగుడు, సుందరకోట పంచాయతీల పరిఽదిలో లేటరైట్‌ తవ్వకాలకు సంబంధించి ఇప్పటివరకు పక్కాగా లెక్కలు లేవు. కాంట్రాక్టరు చెప్పింది రాసుకోడం తప్ప గనులశాఖ పట్టించుకోవడం లేదు. లేటరైట్‌ తవ్వకాల నుంచి ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. ఈ నేపథ్యంలో సీనరేజ్‌ వసూళ్ల కాంట్రాక్టును ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని గనుల శాఖ అధికారులు భావిస్తున్నారు.

కాంట్రాక్టు సంస్థల పోటీ

ఉమ్మడి జిల్లాలో గనుల శాఖకు ఇప్పటివరకు నెలకు రూ.11 కోట్లు ఆదాయం వస్తోంది. వసూళ్ల బాధ్యత ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే నేపథ్యంలో ఆదాయం పెరుగుతుందని భావించిన అధికారులు రూ.16 కోట్లకు టెండర్లు ఖరారుచేశారు. పోటీ ఉన్నందున కాంట్రాక్టు రూ.20 కోట్లకు చేరుతుందని, దీనివల్ల నెలకు రూ.9 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.102 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు అనధికార క్వారీయింగ్‌, దొంగతనంగా లారీల్లో గ్రావెల్‌, రాళ్లు, గ్రానైట్‌, లేటరైట్‌ తరలింపునకు చెక్‌ పడుతుందని భావిస్తున్నారు.

Updated Date - Jul 28 , 2025 | 01:20 AM