హాకీ ..కేరాఫ్ నక్కపల్లి
ABN , Publish Date - Dec 16 , 2025 | 01:36 AM
పదేళ్ల క్రితం వరకు నక్కపల్లి ప్రాంత పిల్లలకు, యువతకు హాకీ అంటే ఏమిటో తెలియదు.
పదేళ్ల క్రితం బీఎస్ హాకీ క్లబ్‌ను ఏర్పాటు చేసిన పోలీసు కానిస్టేబుల్
స్థానిక విద్యార్థులకు ఉచితంగా శిక్షణ
మూడేళ్లలో హాకీలో రాటుదేలిన క్రీడాకారులు
రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో విజయాలు
స్పోర్ట్స్ కోటాలో పలువురికి ప్రభుత్వ ఉద్యోగాలు
నాలుగుసార్లు రాష్ట్రస్థాయి పోటీలకు వేదిక అయిన నక్కపల్లి
నక్కపల్లి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
పదేళ్ల క్రితం వరకు నక్కపల్లి ప్రాంత పిల్లలకు, యువతకు హాకీ అంటే ఏమిటో తెలియదు. హాకీ స్టిక్‌నుగానీ, బాల్‌ను కూడా చూసి వుండరు. ఇటువంటి తరుణంలో హాకీ క్రీడాకారుడిగా స్పోర్ట్స్ కోటాలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన బలిరెడ్డి సూరిబాబు... తనలాగే మరెంతో మందిని హాకీ క్రీడలో తీర్చిదిద్దాలని నిర్ణయించకున్నారు. స్థానికులైన మరో ముగ్గురు ఔత్సాహికులతో కలిసి ‘బీఎస్ హాకీ క్లబ్’ను ఏర్పాటు చేశారు. హాకీ సాధన కోసం ఇళ్లకు వెళ్లి పిల్లలను బతిమాలారు. హాకీ స్టిక్స్, బాల్స్, టీ షర్ట్‌లు, ఇతర పరికరాలు అన్నీ తామే సమకూరుస్తామని చెప్పారు. పిల్లలను గ్రౌండ్‌కు పంపేలా తల్లిదండ్రులను ఒప్పించారు. తొలుత ఐదారుగురు మాత్రమే హాకీ తర్ఫీదుకు రాగా.. ఈ సంఖ్య క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఐదేళ్లు తిరిగేసరికి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగారు. పదేళ్ల కాలంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనే ‘నక్కపల్లి బీఎస్ హాకీ క్లబ్’కు ఒక గుర్తింపు లభించింది.
హాకీ క్రీడ ద్వారా ప్రతిభ కనబర్చి, పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బలిరెడ్డి సూరిబాబు నక్కపల్లిలో హాకీ క్లబ్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆయనకు స్థానికంగా వున్న భవన నిర్మాణ కార్మికుడు కొల్నాటి తాతాజీ, సీనియర్ కళాకారుడు చిన్న అప్పారావు, జాతీయ క్రీడాకారుడు చిన్న అప్పారావు అండగా నిలిచారు. 2016 ఆగస్టులో స్థానికంగా వుండే కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హాకీ ఆటపై అవగాహన కల్పించారు. మీరేమీ ఖర్చు పెట్టనక్కరలేదు. అంతా తామేచూసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. తొలుత 10 మంది పిల్లలతో ‘బీఎస్ హాకీ క్లబ్’ను స్థాపించారు. హాకీ నేర్చుకోవడానికి ఒక్కొక్కరిగా విద్యార్థులు రావడం మొదలుపెట్టారు. రెండేళ్లు తిరిగే సరికి 40 మందికి పెరిగారు. వారికి టీ షర్ట్‌లు, క్రీడా సామగ్రితోపాటు రోజూ పాలు, స్నాక్స్ అందజేశారు. మూడో సంవత్సరం నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొనే నైపుణ్యతను సాధించారు. అలా 10మందితో ప్రారంభమైన హాకీ క్లబ్‌లో ఇప్పుడు అండర్-14, అండర్ -17, అండర్-19 విభాగాల్లో 200 మంది క్రీడాకారులు వున్నారు. వీరిలో పలువురు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. ఇదే సమయంలో 46 మంది క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ పాఠశాలలు, కళాశాలల్లో సీట్లు పొందారు. 10 మంది హాకీ క్రీడాకారులు ఆర్మీ సహా పలురకాల ఉద్యోగాలు పొందారు. నక్కపల్లిలో నాలుగు పర్యాయాలు రాష్ట్రస్థాయి హాకీ పోటీలు నిర్వహించారు. అండర్ -14, అండర్-17 విభాగాల్లో రెండుసార్లు, ఎస్‌జీఎఫ్ 68, 69వ అండర్-19 రాష్ట్రస్థాయి హాకీ పోటీలు ఇక్కడ జరిగాయి.
ఆస్ర్టో టర్ఫ్ గ్రౌండ్
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా నక్కపల్లిలో ఆస్ర్టో టర్ఫ్ హాకీ మైదానాన్ని రూ1.6 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఏపీలో ఇటువంటి మైదానాలు నాలుగు మాత్రమే వుండగా.. వాటిలో నక్కపల్లిలో ఒకటి కావడం విశేషం. సహజసిద్ధమైన గడ్డి కంటే పదునుగా వుండే కృత్రిమ గడ్డితో చేసిన దాన్నే ఆస్ర్టో టర్ఫ్ మైదానంగా పిలుస్తారు. హాకీ సాధన కోసం ఈ మైదానాన్ని వినియోగస్తున్నారు.
భారత జట్టులో స్థానమే లక్ష్యం
బలిరెడ్డి సూరిబాబు, హాకీ క్లబ్ వ్యవస్థాపకుడు
పదేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ హాకీ క్లబ్‌కు అనతి కాలంలోనే ఇంత ఆదరణ లభిస్తుందని ఊహించలేదు. మా క్లబ్ ద్వారా తర్ఫీదు పొందిన క్రీడాకారుల్లో ఎంతోమంది రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో పలువురు ఉద్యోగాలు సాధించారు. అయితే నక్కపల్లి క్రీడాకారులు భారత హాకీ జట్టులో స్థానం సంపాదించాలన్నదే నా లక్ష్యం.
స్పోర్ట్స్ కోటాలో సీటు, ఉద్యోగం
బత్తుల నీరజ, పీఈటీ
ఇక్కడ బీఎస్ హాకీ క్లబ్ ఏర్పాటు చేసే వరకు నాకు హాకీ అంటే తెలియదు. క్లబ్ వ్యవస్థాపకులు, ప్రతినిధులపై నమ్మకంతో హాకీలో శిక్షణ మొదలుపెట్టాను. కోచ్‌ల సూచనలతో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించాను. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో సీటు సంపాదించి డిగ్రీ చదివాను. ఇటీవల పీఈటీగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాను.
స్పోర్ట్స్ కోటాలో ఆర్మీ ఉద్యోగం
కొల్నాటి దుర్గాప్రసాద్, ఆర్మీ సిపాయి
ఆర్మీలో ఉద్యోగం సాధించాలన్నది నా కల. ఏడేళ్లపాటు నక్కపల్లి హాకీ క్లబ్ ద్వారా కఠోర శిక్షణ పొందాను. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించాను. చివరకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సంపాదించాను. కోల్‌కతాలో సిపాయిగా పనిచేస్తున్నాను. దేశానికి సేవ చేసే భాగ్యం నక్కపల్లి బీఎస్ హాకీ క్లబ్ ద్వారా లభించింది.