హమ్మయ్య.. బయటపడ్డారు
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:54 AM
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సరియా జలపాతం అవతలి వైపు అందాలను తిలకించేందుకు వెళ్లిన 31 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో జలపాతం ఉధృతంగా ప్రవహించడంతో అవతలి వైపే ఉండిపోయారు. విషయం తెలిసి పోలీసులు, వలంటీర్లు అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా రోప్ సహాయంతో ఇటు వైపునకు తీసుకువచ్చారు.
- సరియా జలపాతం అవతలి వైపు చిక్కుకున్న 31 మంది పర్యాటకులు
- అందాలను తిలకించేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఉధృతంగా ప్రవహించిన గెడ్డ
- రోప్ సహాయంతో సురక్షితంగా తీసుకువచ్చిన పోలీసులు, వలంటీర్లు
అనంతగిరి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సరియా జలపాతం అవతలి వైపు అందాలను తిలకించేందుకు వెళ్లిన 31 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో జలపాతం ఉధృతంగా ప్రవహించడంతో అవతలి వైపే ఉండిపోయారు. విషయం తెలిసి పోలీసులు, వలంటీర్లు అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా రోప్ సహాయంతో ఇటు వైపునకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మంగళవారం విశాఖపట్నం, గాజువాక, అనకాపల్లికి చెందిన పలువురు పర్యాటకులు సరియా జలపాతాన్ని చూసేందుకు వచ్చారు. మధ్యాహ్నం వీరంతా అవతలి వైపు జలపాతం అందాలను తిలకించేందుకు గెడ్డ దాటి వెళ్లారు. వీరిలో కొందరు వెంటనే వచ్చేశారు. అయితే మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మిగతా 31 మంది పర్యాటకులు ఇటు వైపు రావడానికి ప్రయత్నించారు. వాస్తవానికి హుకుంపేట మండలం పరిధిలోని బాకూరు పక్కనున్న గెడ్డవలస గెడ్డ నుంచే సరియా జలపాతానికి నీరు వస్తుంది. ఎగువన భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా వరద నీరు వచ్చి గెడ్డ పొంగి ప్రవహించింది. దీంతో ఆ 31 మంది పర్యాటకులు ఇటు వైపు రాలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్‌బర్ధార్, అనకాపల్లి ఎస్పీ తుహీన్‌సిన్హా ఆదేశాల మేరకు దేవరాపల్లి ఎస్‌ఐ సత్యనారాయణ, చీడికాడ ఎస్‌ఐ సతీశ్, అనంతగిరి ఎస్‌ఐ శ్రీనివాసరావు, స్థానిక వలంటీర్లు అక్కడికి చేరుకున్నారు. తాడు సహాయంతో ఆ పర్యాటకులను ఇవతలి వైపునకు సురక్షితంగా తీసుకువచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పర్యాటకులను సురక్షితంగా ఇటు వైపునకు తీసుకువచ్చిన వారిలో పోలీసులతో పాటు వలంటీర్లు మహేశ్, రాజు, రాము, టీడీపీ నాయకుడు సురేశ్ ఉన్నారు.