హైవే నిర్మాణంతో పురాతన వంతెనలకు మోక్షం
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:31 AM
మండలంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెనలకు మోక్షం కలిగింది. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 516-ఈ పనుల్లో భాగంగా శిథిలావస్థకు చేరిన వంతెలను తొలగించి వాటి స్థానంలో నూతన వంతెనలను నిర్మిస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి.

మండలంలో బ్రిటిష్ కాలం నాటి రెండు బ్రిడ్జిలను తొలగించి కొత్తగా నిర్మాణం
తీరనున్న వాహనచోదకుల కష్టాలు
కొయ్యూరు, మార్చి 10(ఆంధ్రజ్యోతి): మండలంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెనలకు మోక్షం కలిగింది. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 516-ఈ పనుల్లో భాగంగా శిథిలావస్థకు చేరిన వంతెలను తొలగించి వాటి స్థానంలో నూతన వంతెనలను నిర్మిస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి.
మండలంలోని పెదమాకవరం పంచాయతీ రామరాజుపాలెం వద్ద, అలాగే మాకవరం- నడింపాలెం గ్రామాల మధ్య బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెనలే గత ఏడాది వరకు రాకపోకలకు ఆధారం. కృష్ణాదేవిపేట నుంచి చింతపల్లి వెళ్లే ప్రఽధాన రహదారిలో సుమారు ఎనిమిది దశాబ్దాల క్రితం బ్రిటిష్ పాలనలో ఈ వంతెనలను నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వంతెనలకు కనీస మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. వంతెనలకు ఇరువైపులా రెయిలింగ్‌లు దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో వాహనచోదకులు భయాందోళనతో రాకపోకలు సాగించేవారు. అయితే రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు జాతీయ రహదారి 516-ఈ పనులు ఈ గ్రామాల మీదుగా జరుగుతుండడంతో రామరాజుపాలెం, పి.మాకవరం వంతెనలకు మోక్షం కలిగింది. శిథిలావస్థకు చేరిన ఈ రెండు వంతెనలను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో నూతన వంతెనలు నిర్మించారు. ప్రస్తుతం ఈ వంతెనలకు అప్రోచ్ రోడ్డు పనులు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కొత్త వంతెనలు నిర్మించడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.