శాస్త్రీయ పద్ధతులతో అధిక లాభాలు
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:09 PM
గిరిజన ప్రాంతం సుగంధ ద్రవ్య పంటల సాగుకు అత్యంత అనుకూలమని, రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే అధిక లాభాలు పొందవచ్చునని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
గిరిజన ప్రాంతం సుగంధ ద్రవ్య పంటలకు అనుకూలం
ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి
చింతపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతం సుగంధ ద్రవ్య పంటల సాగుకు అత్యంత అనుకూలమని, రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే అధిక లాభాలు పొందవచ్చునని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. గురువారం స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో స్పైస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ అధికారి కల్యాణి బొడ్డు అధ్యక్షతన సుగంధ ద్రవ్య పంటలపై ప్రాంతీయ నిపుణులతో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ గిరిజన ప్రాంత వాతావరణం, నేలలు అరుదైన సుగంధ ద్రవ్య పంటల సాగుకు అనుకూలమన్నారు. గిరిజన రైతులు పసుపు, అల్లం, చింతపండు, పిప్పళ్లు తదితర పంటలను కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారన్నారు. రైతులు సంప్రదాయ పద్ధతులను పాటించడం వలన ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారని చెప్పారు. రైతులు సేంద్రీయ పద్ధతిలో పంటలను సాగు చేసుకోవడంతో పాటు నూతన యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త చెట్టి బిందు మాట్లాడుతూ అల్లం, పసుపు పంటలను విత్తన శుద్ధి చేసుకుని ఎత్తైన నారు మడులు ఏర్పాటు చేసుకుని నాట్లు వేసుకోవాలన్నారు. ఈ విధంగా చేయడం వలన దుంపకుళ్లు తెగులును నియంత్రించుకోవచ్చునన్నారు. దిగుబడి పెరుగుతుందన్నారు. రైతులు పసుపును ప్రాసెసింగ్ చేసేందుకు యంత్రాలను వినియోగించాలన్నారు. గిరిజన ప్రాంతంలో పండించిన పసుపులో అధిక శాతం కుర్కుమిన్ ఉంటుందని, దీంతో మార్కెట్‌లో మంచి ధర లభిస్తుందన్నారు. రైతులు రోమా పసుపును సాగు చేసుకోవడం మంచిదన్నారు. స్పైస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ అధికారి కల్యాణి బొడ్డు మాట్లాడుతూ ఆదివాసీ రైతులకు 70, 90 శాతం రాయితీపై మిరియాలు శుద్ధి, పసుపు ప్రాసెసింగ్ యంత్రాలను రాయితీపై అందజేస్తున్నామన్నారు. ఆర్గానిక్ ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివాసీ రైతుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు స్పైస్ బోర్డు సహకారం అందిస్తుందని చెప్పారు. ఆసక్తి గల రైతులు, ఎఫ్‌పీవోలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వీసీఎఫ్ టాటా ట్రస్టు సాంకేతిక నిపుణుడు డాక్టర్ అప్పలరాజు, రైతులు పాల్గొన్నారు.