గిరిజనుల మనోభావాలకు అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:55 AM
గిరిజనాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్న కూటమి ప్రభుత్వం, మరో పక్కన గిరిజనులు వ్యతిరేకించే అంశాలపై ముందుకు వెళ్లకుండా వారి మనోభావాలను గౌరవిస్తోంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టులు రద్దు
గిరిజనులు వ్యతిరేకించిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్య
అల్లూరి జిల్లాలోని మూడు ప్రాజెక్టులకు గతంలోనే కేబినెట్ ఆమోదం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
గిరిజనాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్న కూటమి ప్రభుత్వం, మరో పక్కన గిరిజనులు వ్యతిరేకించే అంశాలపై ముందుకు వెళ్లకుండా వారి మనోభావాలను గౌరవిస్తోంది. అరకులోయ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధి పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్మించతలపెట్టిన రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే గిరిజనుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధ అని పలువురు కొనియాడుతున్నారు.
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఐదు చోట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల, గతంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల్లోనూ వాటికి ఆమోదం తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ రేగుపాలెంలో 1800 మెగావాట్‌లు, గుమ్మకోట పంచాయతీ గుజ్జెలిలో 1400 మెగావాట్‌లు, టోకూరు పంచాయతీ చిట్టంపాడు ప్రాంతంలో 800 మెగావాట్‌ల హైడ్రో పవర్‌ప్లాట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో కురుకుట్టి ప్రాంతంలో 1200 మెగావాట్‌లు, కర్రివలస ప్రాంతంలో 1000 మెగావాట్‌ల హైడ్రో పవర్ ప్లాంట్‌లను నిర్మించాలని భావించారు. అందుకు అవసరమైన సర్వేలు చేపట్టారు.
హైడ్రో పవర్ ప్లాంట్‌లపై గిరిజనుల వ్యతిరేకత
గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్‌ల ఏర్పాటును గిరిజనులు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అవే ప్రాజెక్టులను మంజూరు చేసినప్పుడు గిరిజనులు ఐక్యంగా ఉద్యమాలు చేపట్టి, గిరిజన ప్రాంతాలకు నష్టం కలిగించే పవర్ ప్లాంట్‌ల నిర్మాణం వద్దని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మన్యం బంద్‌కు సైతం పిలుపునిచ్చారు. ఆయా ఆందోళనల్లో అప్పుడు విపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు సైతం స్వయంగా పాల్గొని హైడ్రో పవర్ ప్లాంట్‌ల ఏర్పాటును అడ్డుకుంటామని హెచ్చరించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు హైడ్రో పవర్ ప్లాంట్‌ల ఏర్పాటుకు రెండు దఫాలుగా అనుమతులు ఇచ్చింది. అప్పటి నుంచి గిరిజనులు, సీపీఎం, గిరిజన సంఘాల నేతలు పవర్ ప్లాంట్‌ల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. అలాగే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ నెల 19న అనంతగిరి మండలంలో హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మించే రేగుపాలెం ప్రాంతంలో అధిక సంఖ్యలో గిరిజనులతో కలిసి ఆందోళన చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ వాటికి వ్యతిరేకంగా గిరిజనులు, గిరిజన సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.
గిరిజనుల మనోభావాలను గౌరవిస్తూ....
గిరిజన ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్లాంట్‌ల ఏర్పాటును గిరిజనులు వ్యతిరేకిస్తున్నారని తెలుసుకున్న ప్రభుత్వం వారి మనోభావాలను గౌరవిస్తూ పార్వతీపురం మన్యం జిల్లాకు మంజూరైన రెండు హైడ్రో పవర్ ప్లాంట్‌లను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా పరిణామాల నేఫథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రేగుపాలెం, గుజ్జెలి, చిట్టంపాడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం పొందిన ప్లాంట్‌లను ప్రభుత్వం రద్దు చేస్తుందనే ఆశాభావాన్ని గిరిజనులు వ్యక్తం చేస్తున్నారు.