Share News

ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:12 PM

గిరిజన ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని ఏపీ రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి. బాబూరావునాయుడు తెలిపారు.

ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం
టెంట్లువీధిలో పసుపు పంటను పరిశీలిస్తున్న ఏపీ రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.బాబూరావునాయుడు

ఏపీ రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.బాబూరావునాయుడు

గూడెంకొత్తవీధి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని ఏపీ రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి. బాబూరావునాయుడు తెలిపారు. ఆదివారం మండలంలో గిరిజన వికాస్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోత్సాహంతో ఆదివాసీ రైతులు ప్రకృతి సేద్య పద్ధతులను పాటిస్తూ సాగు చేస్తున్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను ఆర్గానిక్‌ హబ్‌గా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఈ మేరకు గిరిజన ప్రాంతంలో వ్యవసాయ, ఉద్యాన, సుగంధ ద్రవ్య పంటలను ఆదివాసీ రైతులు ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయం వలన బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో అధిక ధర లభిస్తుందని చెప్పారు. పెట్టుబడి ఖర్చు తగ్గుతుందన్నారు. ఆహార ఉత్పత్తులు, నేలలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. ఈ మేరకు రైతులు ప్రతి పంటను ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ సాగు చేసుకునేందుకు అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులకు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం ఆయన జీసీసీ సహకారంతో దామనాపల్లి, దేవరాపల్లి, పెదవలస పంచాయతీల్లో సాగు చేస్తున్న కాఫీ, లిచి, ఆవకాడో, పసుపు పంటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఎం భాస్కరరావు, గిరిజన వికాస్‌ కార్యదర్శి నెల్లూరి వెంకట సత్యనారాయణ, ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ యమున, రమ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 11:12 PM