Share News

వైఫల్యాన్ని దాచిపెట్టి... కాంట్రాక్టర్‌కు దోచిపెట్టి!

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:55 AM

గాజువాకలో క్లోజ్డ్‌ కాంపాక్టర్‌ సిస్టమ్‌ (సీసీఎస్‌) ప్రాజెక్టు నిర్వహణ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకు కాంట్రాక్టర్‌, అధికారులు సిద్ధమవు తున్నారు.

వైఫల్యాన్ని దాచిపెట్టి... కాంట్రాక్టర్‌కు దోచిపెట్టి!

గ్రేటర్‌లో ప్రజాధనం దుర్వినియోగం

సీసీఎస్‌ ప్రాజెక్టు నిర్వహణలో గాజువాక కాంట్రాక్టర్‌ విఫలం

ఆ విషయం మరుగున పెట్టి యంత్రాలు పాతవైపోయాయని, కొత్తవి కొనుగోలు చేయాలని

డంపింగ్‌ యార్డు పరిశీలనకు వెళ్లిన స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎదుట అధికారుల ప్రతిపాదన

రూ.పది కోట్ల ఖర్చు...

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గాజువాకలో క్లోజ్డ్‌ కాంపాక్టర్‌ సిస్టమ్‌ (సీసీఎస్‌) ప్రాజెక్టు నిర్వహణ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకు కాంట్రాక్టర్‌, అధికారులు సిద్ధమవు తున్నారు. ప్రాజెక్టు నిర్వహణలో కాంట్రాక్టర్‌ విఫలమైన విషయాన్ని దాచిపెట్టిన అధికారులు ప్రస్తుతం అక్కడున్న యంత్రాలు పాతవైపోవడంతో సరిగా పనిచేయడం లేదని, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు ప్రతిపాదించారు.

నగరంలోని చెత్తను ఓపెన్‌ టిప్పర్లతో కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలించడం వల్ల పర్యావరణ సమస్యతోపాటు రోడ్డు ప్రమాదాలు చోటుచేసు కుంటున్నాయనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీసీఎస్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు కింద ఏ జోన్‌లో ఉత్పత్తి అయిన చెత్తను అదే జోన్‌లోని చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ (యార్డు) వద్ద యంత్రాల్లో వేసి కంప్రెస్‌ చేసి కంటెయినర్‌ లాంటి హుక్‌ లోడర్‌ ద్వారా యార్డుకు తరలించేలా ఏర్పాటుచేశారు. అందులో భాగంగా గాజువాకలో కూడా 2019లో రూ.8.5 కోట్లతో సీసీఎస్‌ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చారు. రెండు హూపర్లతోపాటు చెత్తను తరలించేందుకు ఐదు హుక్‌లోడర్లు (కంటెయినర్‌ వాహనాలు)ను సమకూర్చారు. యంత్రాలతోపాటు వాహనాలకు ఇంధనం జీవీఎంసీయే సరఫరా చేస్తుంది. నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. దీనికోసం కాంట్రాక్టర్‌కు ఏడాదికి రూ.రెండు కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. రెండు హూపర్లతోపాటు, ఐదు హుక్‌ లోడర్లకు రిపేర్లు, వాటికి అవసరమైన విడిభాగాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడం ద్వారా పని సక్రమంగా జరిగేలా కాంట్రాక్టరే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా ఒక హూపర్‌ పనిచేయడం లేదు. అలాగే ఒక హుక్‌లోడర్‌ 16 నెలల కిందట రోడ్డు ప్రమాదానికి గురికాగా ఇప్పటికీ దానికి మరమ్మతు జరగలేదు. హుక్‌లోడర్‌ షెడ్‌లో ఉన్నప్పటికీ సుమారు రూ.21 లక్షలు డీజిల్‌ను ఆ వాహనం పేరుతోనే కాంట్రాక్టర్‌ తీసుకుని ఇతర వాహనాలకు సర్దుబాటు చేసుకున్నారనే ఫిర్యాదులు ఉన్నా, రికవరీ చేయడానికి అధికారులు యత్నించలేదు. తాజాగా నాలుగు రోజుల కిందట ఒక హుక్‌ లోడర్‌ అక్కిరెడ్డిపాలెం వద్ద రోడ్డుప్రమాదానికి గురైంది. ఆ విషయం సోషల్‌ మీడియాలో ఎవరో పోస్ట్‌ చేసేంత వరకూ సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులకు తెలియదు. రెండు హుక్‌ లోడర్లు, ఒక హూపర్‌ పనిచేయకపోతే కాంట్రాక్టర్‌ వాటిని మరమ్మతు చేయించి వినియోగంలోకి తేవాలి. కానీ, అదేమీ లేకుండా ఓపెన్‌ టిప్పర్లతో చెత్తను కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలించడం మొదలుపెట్టారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం.

రూ.పది కోట్లతో కొత్త యంత్రాలకు ప్రతిపాదన

సీఐఐ సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ గురువారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా గాజువాక సీసీఎస్‌ ప్రాజెక్టు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌కు అనుకూలంగా ఉన్న కొందరు కూటమి నేతలు ఆయన్ను సీసీఎస్‌ ప్రాజెక్టుతోపాటు డంపింగ్‌యార్డును పరిశీలించేందుకు రావాలని ఆహ్వానించారు. అక్కడకు ప్రతిరోజూ 300 టన్నుల చెత్త వస్తోందని, సీసీఎస్‌ ప్రాజెక్టు ద్వారా 70 శాతం మాత్రమే కాపులుప్పాడ తరలిస్తున్నారని, మిగిలినది నిల్వ ఉండిపోతోందని వివరించారు. సీసీఎస్‌ ప్రాజెక్టు యంత్రాలు పాతవి కావడం వల్లే చెత్తను పూర్తిగా కంప్రెస్‌ చేసి హుక్‌లోడర్‌ లోపలకు లోడ్‌ చేయలేకపోతున్నట్టు ఇంజనీరింగ్‌ అధికారులతో పట్టాభికి చెప్పించారు. రూ.10 కోట్లతో కొత్తవి కొనుగోలు చేయాల్సింది ఉందని ప్రతిపాదింపజేశారు. కాంట్రాక్టర్‌కు ఏటా రూ.రెండు కోట్లు చెల్లిస్తున్నామని, అయినా సక్రమంగా నిర్వహణ చేపట్టకపోవడం వల్లే యంత్రాలు పనిచేయడం లేదనే విషయాన్ని అధికారులు దాచిపెట్టారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌ అధికారులు ఆ ప్రతిపాదనలతోపాటు సంబంధిత కాంట్రాక్టర్‌ను కూడా సోమవారం విజయవాడ తీసుకువస్తే మంత్రి నారాయణ, సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చేస్తానని పట్టాభి హామీ ఇచ్చారు. అయితే ఒకవైపు పట్టాభిరామ్‌, అధికారులు యార్డులో తిరుగుతుంటే మరోవైపు ఓపెన్‌ టిప్పర్లతో చెత్తను బయటకు తీసుకువెళుతుండడం చూసి అక్కడున్న కొందరు అధికారులు ఆశ్చర్యపోయారు. నెలల తరబడి యంత్రాలు పనిచేయకపోయినా కాంట్రాక్టర్‌ నుంచి రికవరీ ఎందుకు చేయలేకపోతున్నారని అధికారులను ప్రశ్నించగా వారంతా పలుకుబడి కలిగినవారు కావడంతోనే తాము ఏమీ చేయలేకపోతున్నామని సమాధానం ఇచ్చారు.

Updated Date - Nov 07 , 2025 | 12:55 AM