Share News

స్థలాల క్రమబద్ధీకరణలో చేతివాటం

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:36 AM

గాజువాక పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణ పేరుతో వైసీపీ నుంచి కూటమిలో చేరిన నేత ఒకరు భారీగా చేతివాటం చూపడం వెలుగులోకి వచ్చింది.

స్థలాల క్రమబద్ధీకరణలో చేతివాటం

రెవెన్యూ అధికారుల పేరు చెప్పి కూటమి నేత రూ.లక్షల్లో వసూలు

సదరు దరఖాస్తులో చిన్న సమస్య ఉండడంతో పక్కన పెట్టిన అధికారులు

స్థల యజమాని రెవెన్యూ సిబ్బందిని సంప్రదించడంతో వెలుగుచూసిన కూటమి నేత దందా

షాక్‌కు గురైన రెవెన్యూ అధికారులు

విశాఖపట్నం/గాజువాక, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

గాజువాక పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణ పేరుతో వైసీపీ నుంచి కూటమిలో చేరిన నేత ఒకరు భారీగా చేతివాటం చూపడం వెలుగులోకి వచ్చింది. అదికూడా రెవెన్యూ విభాగంలోని అధికారుల పేరు చెప్పి మరీ రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడడం కలకలం రేపుతోంది. గాజువాకలో ఆక్రమణల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి జీవో నంబర్‌-45ను విడుదల చేసింది. ఇంటి పన్ను రశీదు, విద్యుత్‌ బిల్లు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆక్రమణలను క్రమబద్ధీకరించాలని జీవోలో పేర్కొంది. ఈ మేరకు పలువురు ఆక్రమణదారులు తమ స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది డిసెంబరులోగా క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆయా మండల తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కొందరు బ్రోకర్లు రంగంలోకి దిగి తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి స్థలాల క్రమబద్ధీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సర్వే నంబర్‌-86, 87ల్లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు పాల్పడిన ముఠాలు పోటాపోటీగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేస్తున్నారు. ప్రసాదరావు లేఅవుట్‌లో కొన్ని ప్లాట్లకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ముంబైలో ఉన్న ఒకరు తన స్థలం క్రమబద్ధీకరణ కోసం గాజువాకలోని కూటమి నేతను సంప్రదించారు. క్రమబద్ధీకరణ చేయాల్సిన స్థల విస్తీర్ణం పెద్దది కావడంతో రెవెన్యూ అధికారులకు లంచాల కోసం కనీసం రూ.30 లక్షలు ఖర్చవుతుందని సదరు నేత చెప్పడంతో ముంబైలో ఉన్న వ్యక్తి అందుకు అంగీకరించి సొమ్ము చెల్లించారు. అయితే ఈ స్థలం క్రమబద్ధీకరణలో చిన్న సమస్య ఉండడంతో రెవెన్యూ అధికారులు ఆ దరఖాస్తును పక్కన పెట్టేశారు. దీంతో ముంబైకు చెందిన వ్యక్తి తనకు తెలిసిన వారి ద్వారా రెవెన్యూ ఉద్యోగులను కలిసి తాను చెల్లించిన సొమ్ము విషయం వెల్లడించారు. దీంతో ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా రెవెన్యూ అధికారులకు చేరడంతో వారు షాక్‌కు గురై ఈ విషయంపై ఆరా తీశారు.

కాగా కూటమిలో ఉన్న అన్ని పార్టీల నేతలు, విపక్షాలకు చెందిన నాయకులు కూడా కొన్ని ఆక్రమణలకు పాల్పడి వాటిపై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే ప్రాంతంలో కొందరు ఆక్రమణదారులపై కొందరు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఒకే కుటుంబంలో పలువురి పేరుతో ప్లాట్లు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గాజువాక రెవెన్యూ అధికారులు క్రమబద్ధీకరణ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించే పనిలో ఉన్నట్టు తెలిసింది. గాజువాకలో ఆక్రమణల క్రమబద్ధీకరణపై జిల్లా యంత్రాగం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Sep 29 , 2025 | 12:36 AM