Share News

రసాయన విషవాయులు పీల్చి హెల్పర్‌ మృతి

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:22 AM

ఫార్మా వ్యర్థ రసాయనాలు పీల్చడంతో హెల్పర్‌ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. పరవాడలోని విశాఖ ఫార్మాసిటీలో రాంకీ యాజమాన్యానికి చెందిన కామన్‌ఎఫ్లూయంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (సీఈటీపీ)లో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇందుకు స్థానిక సీఐ ఆర్‌.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

రసాయన విషవాయులు పీల్చి హెల్పర్‌ మృతి
మృతుడు చీపురుపల్లి అప్పలనాయుడు ...(ఫైల్‌ఫొటో)

రాంకీ సీఈటీపీలో ఘటన

మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన యాజమాన్యం

పరవాడ, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఫార్మా వ్యర్థ రసాయనాలు పీల్చడంతో హెల్పర్‌ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. పరవాడలోని విశాఖ ఫార్మాసిటీలో రాంకీ యాజమాన్యానికి చెందిన కామన్‌ఎఫ్లూయంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (సీఈటీపీ)లో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇందుకు స్థానిక సీఐ ఆర్‌.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

తానాం గ్రామానికి చెందిన చీపురుపల్లి అప్పలనాయుడు(44) రాంకీ సీఈటీపీలో ల్యాబ్‌ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఫార్మా పరిశ్రమల రసాయన వ్యర్థాలను ఈ ప్లాంట్‌లో శుద్ధి చేస్తుంటారు. రోజూ రసాయన వ్యర్థాల నమూనాలను సేకరిస్తుంటారు. శనివారం రాత్రి విధుల్లో వున్న అప్పలనాయుడు 11 గంటల సమయంలో సీఈటీపీ మ్యాన్‌హోల్‌ వద్ద (సంపు) నమూనాలు సేకరించి ల్యాబ్‌కు తీసుకెళుతున్న క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై కుప్ప కూలిపోయాడు. వెంటనే సహచర కార్మికులు రాంకీకి చెందిన ప్రథమ చికిత్స కేంద్రానికి తరలించి సీఆర్‌పీ చేశారు. మెరుగైన చికత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. ఇతనికి భార్య సత్యవతి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతదేహానికి ఆదివారం కేజీహెచ్‌ మార్చురీలో పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాద స్థలిని ఆదివారం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను రాంకీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కాగా రసాయన వ్యర్థాల నమూనాలను సేకరించే సమయంలో ధరిస్తామని, యాజమాన్యం నాసిరకమైన మాస్కులను సరఫరా చేయడం వల్లనే అప్పలనాయుడు మృతిచెందాడని సహచర కార్మికులు ఆరోపిస్తున్నారు.

మృతుని కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం

వ్యర్థ రసాయనాలు పీల్చడంతో మృతిచెందిన చీపురుపల్లి అప్పలనాయుడు కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం అందించేందుకు రాంకీ యాజమాన్యం అంగీకరించింది. దహన సంస్కార ఖర్చుల నిమిత్తం అదనంగా రూ.లక్ష ఇస్తామని, మృతుని భార్యకు శాశ్వత ఉపాధి, ఇద్దరు పిల్లలను ఇంటర్మీడియట్‌ పూర్తయ్యే వరకు కార్పొరేట్‌ పాఠశాల/ కళాశాలలో చదివించేందుకు రాంకీ యాజమాన్య ప్రతినిధులు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. యాజమాన్య ప్రతినిధులతో జరిపిన చర్చల్లో జడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు పైలా జగన్నాథరావు, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ కన్నూరు వెంకటరమణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ, తహసీల్దార్‌ ఎస్‌వీ అంబేడ్కర్‌, సీఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:22 AM