నరకప్రయాణం
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:14 AM
మరమ్మతులకు నోచుకోని రహదారులు.. తరచూ కురుస్తున్న వర్షాలు.. అధిక లోడుతో నడుస్తున్న భారీ వాహనాలు.. వెరసి జిల్లాలో పలు రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి, వర్షం నీరు నిలిచిపోయి వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట.. ముఖ్యంగా కొత్త ఆయా రహదారుల్లో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు దగ్గరకు వచ్చే వరకు గోతులు కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. రహదారులు గోతుల మయం కావడంతో అన్ని రకాల వాహనాల పాడైపోతున్నాయి.
అధ్వానంగా తయారైన రహదారులు
వర్షాలతో పరిస్థితి మరింత దారుణం
గోతుల్లో నీరుచేరి.. వాహనదారుల ఇక్కట్లు
పాడైపోతున్న వాహనాల విడిభాగాలు
రెట్టింపు అయిన ప్రయాణ సమయం
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
మరమ్మతులకు నోచుకోని రహదారులు.. తరచూ కురుస్తున్న వర్షాలు.. అధిక లోడుతో నడుస్తున్న భారీ వాహనాలు.. వెరసి జిల్లాలో పలు రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి, వర్షం నీరు నిలిచిపోయి వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట.. ముఖ్యంగా కొత్త ఆయా రహదారుల్లో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు దగ్గరకు వచ్చే వరకు గోతులు కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. రహదారులు గోతుల మయం కావడంతో అన్ని రకాల వాహనాల పాడైపోతున్నాయి.
జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 245 కిలోమీటర్ల పొడవున రోడ్లు ఉన్నాయి. వీటిలో 175 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు, మిగిలినవి జిల్లా రహదారులు, మరో 150 కిలోమీటర్ల వరకు గ్రామీణ రోడ్లు ఉన్నాయి. వైసీపీ హయాంలో రహదారులకు నిర్వహణ పనులను గాలికొదిలేసింది. కొన్నిచోట్ల రహదారులకు అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. దీనికితోడు భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు మరింత పాడయ్యాయి. కనీసం గోతులు కూడా కప్పకపోవడంతో రానురాను అవి మరింత పెద్దవయ్యాయి. కొద్దిపాటి వర్షం కురిసినా.. గోతుల్లో నీరు చేరి పంట కుంటలను తలపిస్తున్నాయి. భారీ వాహనాలు వెళుతున్నప్పుడు గోతులు మరింత పెరిగిపోయి, రాళ్లు లేచి రోడ్డుపై పడుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్ధగంట పట్టే ప్రయాణం.. గోతుల కారణంగా గంటకుపైగా పడుతున్నది.
ముఖ్యంగా బీఎన్ రోడ్డులో సబ్బవరం మండలం లింగాలతిరుగుడు నుంచి వెంకన్నపాలెం, చోడవరం, వడ్డాది, రావికమతం మీదుగా రోలుగుంట మండలం వెలంకాయలపాలెం వరకు, వడ్డాది-పాడేరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో వడ్డాది నుంచి మాడుగుల మండలం తాటిపర్తి వరకు, అనకాపల్లి నుంచి చోడవరం మండలం వెంకన్నపాలెం వరకు, ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు నుంచి కోటవురట్ల మీదుగా నర్సీపట్నం వెళ్లే రోడ్డులో ఇందేశమ్మవాక ప్రాంతం, రావికమతం నుంచి తట్టబంద వెళ్లే రోడ్డు, పరవాడ నుంచి అచ్యుతాపురం మీదుగా ఎలమంచిలి వెళ్లే రోడ్లు, జాతీయ రహదారి నుంచి నర్సీపట్నం వెళ్లే రోడ్డులో తాళ్లపాలెం వద్ద.. ఇలా చెప్పుకుంటూపోతే అధ్వాన రోడ్లకు అంతే వుండదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది ‘పల్లె పండుగ’ పేరుతో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రహదారులపై ఏర్పడిన గోతులను తాత్కాలికంగా కప్పారు. ఈ ఏడాది వేసవి వరకు పరిస్థితి బాగానే వుంది. వర్షాకాలం మొదలైన తరువాత రోడ్లపై ఎక్కువసేపు నీరు నిలిచిపోవడం, భారీ వాహనాల రాకపోకలతో ప్యాచ్ వర్క్‌లు లేచిపోయి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. వర్షాకాలం ముగుస్తున్నందున రహదారుల అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ప్రజలు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.