Share News

మళ్లీ హెలీ టూరిజం

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:51 AM

విశాఖపట్నంలో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టడానికి అనేక సంస్థలు ఆసక్తిగా ముందుకువస్తున్నాయి.

మళ్లీ హెలీ టూరిజం

భాగస్వామ్య సదస్సులో విహంగ్‌ అడ్వంచర్స్‌ ఒప్పందం

క్రూయిజ్‌ నడపడానికి పలు సంస్థల ఆసక్తి

ఇబ్బడిముబ్బడిగా గోల్ఫ్‌ కోర్సులు

‘ప్లానెక్స్‌ రీసైక్లింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌’, ‘సన్‌విక్‌ గోల్ఫ్‌’ సంస్థల ఎంవోయూలు

రూ.750 కోట్లు పెట్టుబడులు, 5,000 మందికి ఉద్యోగాలు

విశాఖపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నంలో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టడానికి అనేక సంస్థలు ఆసక్తిగా ముందుకువస్తున్నాయి. వీటిలో కొన్ని గత వారం జరిగిన భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. విశాఖ మహా నగరాభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఎనిమిదేళ్ల క్రితం హెలీ టూరిజం తీసుకువచ్చింది. బీచ్‌రోడ్డులో వుడా పార్కు నుంచి రుషికొండ వరకూ రూ.2,500 టిక్కెట్‌ పెట్టి ప్రయోగాత్మకంగా నడిపింది. విశాఖ నుంచి అరకులోయ కూడా నడపాలని యత్నించింది. సాంకేతిక కారణాల వల్ల అది ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధి కోసం ఎటువంటి అనుమతులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండడంతో మళ్లీ హెలీ టూరిజం నగరంలో ప్రారంభించడానికి విహంగ్‌ అడ్వంచర్స్‌ సంస్థ సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.20 కోట్లు వెచ్చించి గగన విహారాన్ని విశాఖ ప్రజలకు అందుబాటులోకి తేవడానికి నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు వల్ల 130 మందికి ఉపాధి లభించనుంది. వింగ్‌ మాస్టర్స్‌ కో అనే సంస్థ ఏరో అడ్వంచర్‌ స్పోర్ట్స్‌కు రూ.5 కోట్లు పెట్టుబడి పెడతామని, 70 మందికి ఉద్యోగాలు ఇస్తామని ఎంఓయూ చేసింది. టెర్మినల్‌ హోల్డింగ్స్‌ అనే సంస్థ రూ.500 కోట్లతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఒప్పందం చేసింది. ఇది శ్రీకాకుళం జిల్లాలో వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దీని ద్వారా 2,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

విశాఖపట్నం పోర్టు రూ.100 కోట్ల వ్యయంతో ఇంటర్నేషనల్‌ క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మించింది. దీనిని సద్వినియోగం చేయాలని పర్యాటక శాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కార్డిలియో గ్రూపు ప్రతినిధులను తీసుకువచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడించింది. కాకినాడ-విశాఖపట్నం-భీమిలి మధ్య ఒక క్రూయిజ్‌ నడపాలని ప్రభుత్వం కోరింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఇది కాకుండా శాండీ క్రూయిజ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ రూ.250 కోట్లతో క్రూయిజ్‌ మెరైన్‌ పెట్టడానికి ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా 300 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

గోల్ఫ్‌ కోర్సులు

విశాఖపట్నంలో ముడసర్లోవ పార్కు పక్కనే ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ ఉంది. నేవీ అధికారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. పెద్ద మొత్తంలో భూములు అవసరమయ్యే ఈ ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వచ్చారు. భోగాపురం, భీమిలి పరిసరాల్లో వీటికి భూములు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ప్లానెక్స్‌ రీసైక్లింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ గోల్ఫ్‌ కోర్సుతో పాటు రిసార్ట్‌ కూడా పెడతామని ముందుకు వచ్చింది. రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టి, 4,200 మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. సన్‌విక్‌ గోల్ఫ్‌ అనే సంస్థ రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టి 1,350 మందికి ఉద్యోగాలు ఇస్తామని ఎంఓయూ చేసింది.

Updated Date - Nov 19 , 2025 | 12:51 AM