జోరుగా వరి కోతలు
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:04 AM
వారం రోజుల విరామం తరువాత జిల్లాలో వరి కోతలు పునఃప్రారంభం అయ్యాయి. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయి వాతావరణం తెరిపివ్వడంతో రైతులు వరి కోతల పనులను ముమ్మరం చేశారు. వారం క్రితం కుప్ప వేసిన రైతులు వరి పంటను నూర్చుతున్నారు.
తుఫాన్ ప్రభావం తగ్గడంతో ఊపిరిపీల్చుకున్న రైతులు
పూర్తిగా తెరిపిచ్చిన వాతావరణం
వారం రోజుల విరామం తరువాత వరి కోతలు పునఃప్రారంభం
రైతులకు అందుబాటులో కోత, నూర్పిడి యంత్రాలు
పలు కేంద్రాల్లో మొదలైన ధాన్యం కొనుగోళ్లు
అనకాపల్లి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వారం రోజుల విరామం తరువాత జిల్లాలో వరి కోతలు పునఃప్రారంభం అయ్యాయి. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయి వాతావరణం తెరిపివ్వడంతో రైతులు వరి కోతల పనులను ముమ్మరం చేశారు. వారం క్రితం కుప్ప వేసిన రైతులు వరి పంటను నూర్చుతున్నారు.
బంగాళాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుఫాన్ ప్రభావంతో ఆకాశం మేఘావృతంగా వుండడం, జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం వుందన్న వాతావరణ శాఖ సమాచారంతో రైతులు వరి కోతలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అప్పటికే కోత కోసిన పొలాల్లో రైతులు ఆదరాబాదరా కుప్పలు వేసుకున్నారు. తుఫాన్ ప్రభావం అనకాపల్లి జిల్లాపై అంతగా ప్రభావం చూపకపోవడంతో అన్నదాతలు ఊరట చెందారు. రెండు, మూడు రోజులపాటు చెదురుమదురుగా జల్లులు పడినప్పటికీ ఎక్కడా వరి పంటకు నష్టం వాటిల్లలేదు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సుమారు 55 వేల హెక్టారుల్లో వరి సాగు చేపట్టారు. ఆకుమడులు పోసేటప్పుడు, నాట్లు వేసే సమయంలో అవసరమైన మేర వర్షాలు పడకపోవడంతో వరినాట్లు కొంతమేర ఆలస్యం అయ్యాయి. ఆగస్టు రెండో వారం నుంచి విస్తారంగా వర్షాలు పడడంతో అప్పుడు వరినాట్లు ఊపందుకున్నాయి. సాధారణంగా జిల్లాలో నవంబరు నెలలో వరి కోతలు, నూర్పిడి పనులు ముమ్మరంగా సాగుతాయి. అయితే ఈ ఏడాది వరినాట్లు ఆలస్యం కావడంతో ఆ ప్రభావం వరి కోతలపై పడింది. బోర్లు, బావుల కింద ముందస్తుగా వరినాట్లు వేసిన పొలాల్లో నవంబరు రెండో వారం నుంచే కోతలు మొదలుపెట్టగా, మిగిలినచోట్ల మూడో వారంలో ప్రారంభించారు. వరికోతలు ఊపందుకునే చివరి వారంలో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడడంతో ఆటంకం ఏర్పడింది. సుమారు వారం రోజులపాటు వరికోతలు చేపట్టలేదు. తుఫాన్ గమనం నెమ్మదించడం, దిశ మార్చుకోవడం వంటి పరిణామాలతో జిల్లాలో నాలుగైదు రోజులపాటు ముసురు వాతావరణం నెలకొని, అడపాదడపా జల్లులు పడ్డాయి. తుఫాన్ బుధవారం వాయుగుండంగా బలహీనపడి తీరాన్ని తాకిన తరువాత అల్పపీడనంగా మరింత బలహీన పడింది. దీంతో గురువారం ఆకాశం నిర్మలంగా వుండి ఎండ కాయడంతో రైతులు వరి కోతలు మొదలుపెట్టారు. తుఫాన్‌కు ముందు వరికోతలు పూర్తిచేసి, హడావిడిగా కుప్పలు వేసిన రైతులు.. ఇప్పుడు కుప్ప నూర్పిడి పనులు చేపట్టారు. వాతావరణం ఇదే విధంగా కొనసాగితే మరో పక్షం రోజుల్లో జిల్లా అంతటా వరి కోతలు పూర్తవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
మొదలైన ధాన్యం సేకరణ
పౌరసరఫరా శాఖ అధికారులు జిల్లాలో ఇప్పటికే ధాన్యం సేకరణను ప్రారంభించారు. గురువారంనాటికి చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, మాడుగుల, రావికమతం మండలాల్లో 149 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటికే పదిచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, త్వరలో మరో 54 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు జయంతి తెలిపారు. కాగా రైతులంతా ఒకేసారి వరి కోతలు మొదలుపెట్టడంతో కూలీల కొరత ఏర్పడే అవకాశం వుందని, ఈ సమస్యను నివారించడానికి వరి కోత, నూర్పిడి యంత్రాలను రైతులకు అందుబాటులో వుంచుతున్నామని జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి తెలిపారు.