Share News

జోరుగా వరి కోతలు

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:44 AM

ప్రస్తుతం మన్యంలో ఎక్కడ చూసినా వరి కోతలు, నూర్పులు చేపడుతున్న గిరిజనులే కనిపిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు అనుకూలించడంతో పంట సైతం ఆశాజనకంగానే చేతికి వస్తున్నది.

జోరుగా వరి కోతలు
పాడేరు మండలం చింతలవీధి సమీపంలో వరి కోతల్లో గిరి మహిళలు

అల్పపీడనం నేపథ్యంలో హడావిడిగా నూర్పులు

యంత్రాల వినియోగంపై గిరిజనుల శ్రద్ధ

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ప్రస్తుతం మన్యంలో ఎక్కడ చూసినా వరి కోతలు, నూర్పులు చేపడుతున్న గిరిజనులే కనిపిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు అనుకూలించడంతో పంట సైతం ఆశాజనకంగానే చేతికి వస్తున్నది. అయితే తాజాగా వాతావరణం మారిపోవడం, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంలో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో గిరి రైతులు కోతల జోరు పెంచారు.

ఈ ఏడాది ఖరీఫ్‌లో 57,773 హెక్టార్లలో వరి పంటను గిరిజన రైతులు సాగు చేశారు. ప్రతి ఏడాది నవంబరు రెండో వారం నుంచి వరి కోతలు మొదలయ్యేవి. కానీ ఈ ఏడాది వర్షాలు అనుకూలించడంతో అక్టోబరు రెండో వారం నుంచే కోతలుమొదలు పెట్టారు. మరో రెండు వారాల్లో మొత్తం కోతల ప్రక్రియ ముగియనుంది. ఈ క్రమంలో వాతావరణం ప్రతికూలంగా మారితే చేతికి అందివచ్చే పంట నీటిపాలవుతుందనే ఆందోళనలో గిరి రైతులున్నారు. దీంతో కోతలు, నూర్పులను ముమ్మరం చేశారు.

యంత్రాలతో జోరుగా నూర్పులు

గిరిజనులు కోతలు స్వయంగా చేపట్టినప్పటికీ నూర్పులు మాత్రం యంత్రాలతో జోరుగా చేపడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పంటను పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో ఒక వైపు ముమ్మరంగా కోతలు చేపడుతూ, మరో వైపు యంత్రాలతోనే నూర్పులు కొనసాగిస్తున్నారు. దీంతో కోతలు చేపట్టిన రోజే నూర్పులు సైతం పూర్తి చేసుకుని ధాన్యాన్ని ఇళ్లకు తరలిస్తున్నారు. దీంతో ప్రస్తుతం నూర్పుడు యంత్రాలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. అయితే మనుషులు, పశువులతో నూర్పులు చేపట్టే కంటే యంత్రాలతో చేపట్టడం ద్వారా ఖర్చులు ఆదాతో పాటు సమయం కలిసివస్తుందని రైతులు అంటున్నారు.

Updated Date - Nov 25 , 2025 | 12:44 AM