శివారున జోరు వాన
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:14 AM
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం నగరంలో పలుచోట్ల భారీవర్షం కురిసింది.
పెందుర్తి నుంచి గోపాలపట్నం మధ్య భారీ వర్షం
పెందుర్తి జోనల్ కార్యాలయం వద్ద 81 మి.మీ.లు
విశాఖపట్నం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం నగరంలో పలుచోట్ల భారీవర్షం కురిసింది. ముఖ్యంగా పెందుర్తి నుంచి గోపాలపట్నం మధ్య రెండు గంటలపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గెడ్డలు, వాగులు పొంగాయి. పెందుర్తి జోనల్ కార్యాలయంలో 81 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. నగరంతోపాటు గాజువాక, పెదగంట్యాడ తదితర ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం కురిసింది.
సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ నమోదైన వర్షపాతం వివరాలు
కేంద్రం మి.మీ.లు
పెందుర్తి జోనల్ కార్యాలయం 81
మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ 80.5
పెందుర్తి పీడబ్ల్యుడీ కార్యాలయం 79.5
వేపగుంట 66.75
కొత్తపాలెం 66
చీమలాపల్లి 54.75
బుచ్చిరాజుపాలెం 52.25
అధ్యయన యాత్రకు దూరం
కొందరు కార్పొరేటర్ల నిర్ణయం
ఇప్పటికే మేయర్, కమిషనర్‌లకు లేఖ
అందజేసిన సీపీఎం కార్పొరేటర్ గంగారావు
అదేబాటలో మరికొందరు
విశాఖపట్నం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):
ఉత్తర భారతదేశ అధ్యయన యాత్రకు కొందరు కార్పొరేటర్లు విముఖత చూపుతున్నారు. ప్రజాధనం వెచ్చించి అధ్యయన యాత్ర పేరుతో విహార యాత్రలకు వెళ్లడం సరికాదని, అందుకే తాము తిరస్కరిస్తున్నట్టు మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్‌గార్గ్‌లకు తెలియజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీపీఎం కార్పొరేటర్ బి.గంగారావు సోమవారం మేయర్, కమిషనర్‌లకు లేఖ పంపించగా, 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ అధ్యయన యాత్రకు తాను రాబోవడం లేదని అధికారులకు లిఖితపూర్వకంగా ఇప్పటికే సమాధానం ఇచ్చారు. అలాగే 91వ వార్డు కార్పొరేటర్ కుంచె జ్యోత్స్న, 92వ వార్డు కార్పొరేఏటర్ బెహరా స్వర్ణలత కూడా అధ్యయన యాత్రను బహిష్కరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. 12వ వార్డు కార్పొరేటర్ అక్కరమాని రోహిణి యాత్రకు దూరంగా ఉంటున్నట్టు ఇతర కార్పొరేటర్లకు తెలిపినట్టు సమాచారం.
ఏయూ ఆడిట్ కార్యాలయంలో లైంగిక వేధింపులు
అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతున్న ఉన్నతాధికారిని నిలదీసిన ఉద్యోగిని
విశాఖపట్నం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఆడిట్ కార్యాలయంలో లైంగిక వేధింపుల వ్యవహారం సోమవారం పెద్ద రచ్చకు దారితీసింది. అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్న డిప్యూటీ డైరెక్టర్‌పై ఓ ఉద్యోగిని విరుచుకుపడ్డారు. ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇది జరిగి రెండు రోజులు కాకుండానే మరోసారి మెసేజ్‌లు పెట్టడంతో సోమవారం ఆమె గట్టిగా నిలదీశారు. బుద్ధి మార్చుకోవాలంటూ హెచ్చరించారు. అనంతరం గొడవ పెద్దది కావడంతో విషయం డిప్యూటీ రిజిస్ర్టార్ దృష్టికి వెళ్లింది. అక్కడ సదరు ఉన్నతాధికారి వేధింపుల గురించి మహిళ ఉద్యోగి వివరించడంతో ఆయనకు చీవాట్లు పెట్టారు. పద్ధతి మార్చుకోవాలంటూ హితబోధ చేశారు. ఇదిలావుంటే ఈ తరహా వేధింపులు సదరు ఉన్నతోద్యోగికి కొత్త కాదని పలువురు పేర్కొంటున్నారు. గతంలోనూ ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయంటున్నారు.