Share News

మన్యంలో భారీ వర్షం

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:16 PM

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీలో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండకాయగా, ఆ తరువాత వర్షం మొదలైంది.

మన్యంలో భారీ వర్షం
అనంతగిరి మండలం నేలపాలెం సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటుతున్న తండ్రి, కొడుకు

ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు

జనజీవనానికి అంతరాయం

పాడేరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీలో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండకాయగా, ఆ తరువాత వర్షం మొదలైంది. పాడేరు మొదలుకుని దాదాపుగా అన్ని మండలాల్లోనూ ముసురు వాతావరణం నెలకొంది. తాజా వర్షాలతో జన జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతుండగా, పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అరకు, అనంతగిరిలో..

అనంతగిరి/అరకులోయ: అనంతగిరి, అరకులోయ మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. చొంపి నుంచి పలు గ్రామాలకు వెళ్లేందుకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెదకోట- కుడియా కాజ్‌వే పైనుంచి గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గెడ్డ అవతలి వైపు ఉన్న గ్రామాల గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు.

గెడ్డ ఉధృతి

అనంతగిరి: మండలంలో కురుస్తున్న వర్షాలకు లంగుపర్తి పంచాయతీ నేలపాలెం గ్రామ సమీపంలోని గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ గ్రామానికి చెందిన కొన్నేడి గాసన్న, అతని కుమారుడు పండన్న అటవీ పట్టాకు సంబంధించిన పనిమీద లంగుపర్తి సచివాలయానికి గురువారం గెడ్డను దాటుకుని వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో గెడ్డ ఉధృతి పెరగడంతో ప్రాణాలకు తెగించి గెడ్డ దాటి ఇంటికి చేరారు.

జీకేవీధిలో...

గూడెంకొత్తవీధి: మండలంలో భారీ వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కుండపోత వర్షం పడింది. దీంతో ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. జీకేవీధి వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు వర్షానికి ఇబ్బంది పడ్డారు.

Updated Date - Oct 23 , 2025 | 11:16 PM