మన్యంలో భారీ వర్షం
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:08 AM
జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తీవ్రమైన ఎండకాయగా, ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
జనజీవనానికి అంతరాయం
చింతూరు డివిజన్‌లోని ముంపు మండలాలపై ప్రత్యేక దృష్టి
పాడేరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తీవ్రమైన ఎండకాయగా, ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
ప్రధానంగా మండల కేంద్రాల్లో కాకుండా రూరల్ ప్రాంతాల్లో భారీ స్థాయిలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి భారీ వర్షం కొనసాగింది. వర్షాలకు పాడేరు మండలంలోని మత్స్యగెడ్డ, రాయిగెడ్డ, చిలకలమామిడి గెడ్డ, పాడేరు, పెదబయలు మండలాలకు సరిహద్దున ఉన్న పరదానిపుట్టు గెడ్డ, జి.మాడుగుల మండలంలోని కోడిమామిడి గెడ్డ, మత్స్యగెడ్డలతో పాటు ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, పెదబయలు మండలాల్లోని గెడ్డల్లోకి వరద నీరు వచ్చి చేరింది. వర్షం వలన జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చింతూరు డివిజన్‌పై యంత్రాంగం ప్రత్యేక దృష్టి
జిల్లాలోని చింతూరు రెవెన్యూ డివిజన్‌లో వరద ముంపునకు గురయ్యే నాలుగు మండలాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి కనబరుస్తున్నారు. చింతూరు డివిజన్ పరిధిలోని గోదావరి, శబరి నదుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్ పురం మండలాల్లో ముంపు సమస్య తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు.
జి.మాడుగులలో...
జి.మాడుగుల: మండలంలో శనివారం పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లాయి. కొత్తపల్లి జలపాతంలో వరద ఉధృతి పరవళ్లు తొక్కుతోంది. మండల కేంద్రం చిత్తడిగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.