మన్యంలో భారీ వర్షం
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:46 AM
మన్యంలో శనివారం రాత్రి నుంచి ఈదురుగాలులతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నది. గత రెండు రోజులుగా ముసురు వాతావరణం నెలకొనగా, ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఒడిశాను ఆనుకుని ఉన్న పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
- రహదారులు జలమయం
- పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు
పాడేరు, జూన్ 29(ఆంధ్రజ్యోతి): మన్యంలో శనివారం రాత్రి నుంచి ఈదురుగాలులతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నది. గత రెండు రోజులుగా ముసురు వాతావరణం నెలకొనగా, ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఒడిశాను ఆనుకుని ఉన్న పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ వ్యవసాయ పనులు జరుగుతుండడంతో తాజా వర్షాలు తమకు అనుకూలిస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దుక్కి, దమ్ము పనులకు వర్షపు నీరు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు. అలాగే భారీ వర్షాలకు ఎక్కడ చూసినా వర్షపు నీటితో పంట పొలాలు కళకళలాడుతున్నాయి. అయితే గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగానే కొనసాగాయి. ఆదివారం కొయ్యూరులో 34.8, పాడేరులో 30.8, చింతపల్లిలో 29.6, జీకేవీధిలో 28.9, పెదబయలు, డుంబ్రిగుడలో 28.0, అనంతగిరి, జి.మాడుగులలో 27.9, హుకుంపేటలో 28.5, అరకులోయలో 27.6, ముంచంగిపుట్టులో 26.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చింతపల్లిలో...
చింతపల్లి: మండలంలో ముసురు వాతావరణం నెలకొన్నది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. వర్షం వల్ల ప్రధాన రహదారులు జలమయమైపోయాయి. కోరుకొండ వారపు సంతల్లో వర్తకులు, వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. వర్షంతో పాటు గాలి ఉండడంతో విద్యుత్ సరఫరాకు పలుమార్లు అంతరాయం కలిగింది.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండల పరిధిలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి పలు గ్రామాల్లో వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల్లో మట్టి రహదారులు బురదమయంగా మారడంతో అటుగా వాహన రాకపోకలు అతికష్టంపై సాగిస్తున్నారు. మత్స్యగెడ్డ ప్రవాహిత నీటిపై ఆధారపడి ఉన్న జోలాపుట్టు, డుడుమ జలాశయాలకు వరదనీరు ఇన్‌ఫ్లో పెరిగిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
కూలిన భారీ వృక్షం
గూడెంకొత్తవీధి: మండలంలో కురుస్తున్న వర్షానికి జీకేవీధి- ఆర్‌వీనగర్ మార్గంలో భారీ వృక్షం కూలిపడిపోయింది. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా గాలితో కూడిన వర్షం కురిసింది. ఉదయం ఏడు గంటల సమయంలో జీకేవీధి-ఆర్‌వీనగర్ మార్గంలో భారీ వృక్షం రహదారికి అడ్డంగా పడిపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ద్విచక్రవాహనాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ అప్పలసూరి సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక గిరిజనులతో వృక్షాన్ని తొలగించారు. దీంతో మూడు గంటల తరువాత వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి.
సీలేరులో..
సీలేరు: స్థానిక మేజర్ పంచాయతీలో భారీ వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా వర్షం పడింది. దీంతో సీలేరు వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు అవస్థలు పడ్డారు.