Share News

ముసురు

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:41 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు దఫదఫాలుగా వర్షం కురుస్తూనే వుంది. కొన్ని మండలాల్లో భారీ వర్షం, మరికొన్ని మండలాల్లో మోస్తరు వర్షం పడింది. రోజంతా ముసురు వాతావరణం నెలకొంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది.

ముసురు
మునగపాకలో వర్షం

పలు మండలాల్లో భారీ వర్షం

లోతట్టు ప్రాంతాలు జలమయం

నదులు, వాగులు, గెడ్డల్లో పెరిగిన వరద ప్రవాహం

నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ కొనసాగింపు

అనకాపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి-న్యూస్‌ నెట్‌వర్క్‌): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు దఫదఫాలుగా వర్షం కురుస్తూనే వుంది. కొన్ని మండలాల్లో భారీ వర్షం, మరికొన్ని మండలాల్లో మోస్తరు వర్షం పడింది. రోజంతా ముసురు వాతావరణం నెలకొంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. కొన్నిచోట్ల రహదారులపై వర్షం నీరు ప్రవహించి కాలువలను తలపించాయి. నదులు, వాగులు, గెడ్డల్లో వరద ప్రవాహం పెరిగింది. అన్ని జలాశయాల్లోకి వరద నీరు చేరుతున్నది. తాండవ మినహా మిగిలిన రిజర్వాయర్ల స్పిల్‌వే గేట్లు ఎత్తి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆయా నదులకు ఇరువైపులా వున్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా వర్షాల వల్ల పలుచోట్ల రహదారులు దెబ్బతింటున్నాయి. బీఎన్‌ రోడ్డులో చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాలు, వడ్డాది- పాడేరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో మాడుగుల మండలంలో, కశింకోట మండలం తాళ్లపాలెం- నర్సీపట్నం రోడ్డులో పలుచోట్ల ఏర్పడిన భారీ గోతుల్లో నీరు నిలిచి చెరువులను తలపించాయి. గోతుల్లో నుంచి ప్రయాణించడానికి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఇదిలావుండగా అధిక వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. లోతట్టు భూముల్లో ఎక్కువ రోజులు నీరు నిలిచిపోతే అపరాలు, కూరగాయలు, పత్తి, మిర్చి వంటి పంటలు దెబ్బతింటాయని అంటున్నారు.

అధికారులు అప్రమత్తం

జిల్లాకు భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎక్కడా ప్రాణహాని జరగకుండా చూడాలన్నారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌

వర్షాలు కురుస్తుండడంతో కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను మరో రెండు రోజులపాటు కొనసాగించనున్నారు. సిబ్బంది 24 గంటలు పనిచేసేలా వివిధ కార్యాలయాల నుంచి డిప్యూటేషన్‌పై నియమించారు. కంట్రోల్‌ రూమ్‌లో 08924-288888, 08924-225999, 08924-226599 ఫోన్‌ నంబర్లను అందుబాటులో ఉంచారు.

వర్షపాతం...

జిల్లాలో గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. నాతవరం మండలంలో 25.88 మిల్లీమీటర్లు, చోడవరంలో 22.75, దేవరాపల్లిలో 20.38, మాకవరపాలెంలో 14.25, రావికమతంలో 13.33, బుచ్చెయ్యపేటలో 12.13, కశింకోటలో 11.88, కె.కోటపాడులో 11.38, నర్సీపట్నంలో 10.88, కోటవురట్లలో 10.50, రోలుగుంటలో 10.50, మునగపాకలో 9.38, అనకాపల్లిలో 8.97, మాడుగులలో 7.67, గొలుగొండలో 7.38, నక్కపల్లిలో 7, చీడికాడలో 6, పాయకరావుపేటలో 4.5, పరవాడలో 4.29, ఎలమంచిలిలో 4.14, ఎస్‌.రాయవరంలో 3.88, సబ్బవరంలో 0.92, రాంబిల్లిలో 0.63, అచ్యుతాపురంలో 0.13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - Oct 24 , 2025 | 12:41 AM