భారీ వర్షం
ABN , Publish Date - Aug 27 , 2025 | 01:14 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నగరంలో మంగళవారం భారీవర్షం కురిసింది.
ఉదయం నుంచి ముసురు
లోతట్టు ప్రాంతాలు జలమయం
భీమిలిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం
నేడు కూడా వర్షాలు
విశాఖపట్నం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నగరంలో మంగళవారం భారీవర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తెరిపివ్వలేదు. ఈ సీజన్‌లో పది రోజుల క్రితం ఒకసారి రోజంతా వర్షం కురిసింది. మళ్లీ మంగళవారం అదేవిధంగా ముసురు వాతావరణం కొనసాగింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడక్కడా రోడ్లపై నీరు ప్రవహించడంతో వాహనచోదకులు ఇబ్బందిపడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భీమిలిలో 60, మహారాణిపేటలో 52.2, పెందుర్తి 51.8, గాజువాక, ములగాడల్లో 51.4, ఆనందపురంలో 51.2, పెదగంట్యాడలో 51, విశాఖపట్నం రూరల్‌లో 50.6, సీతమ్మధారలో 48.6, గోపాలపట్నంలో 44.2, పద్మనాభంలో 39.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా బుధవారం కూడా జిల్లాలో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నిండుకుండలా మేహాద్రిగెడ్డ
గోపాలపట్నం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి):
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. గత నెలాఖరు వరకూ 49 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం ప్రస్తుతం ఎనిమిది అడుగుల మేర పెరిగింది. ఎగువ ప్రాంతంలో చెరువులు నిండి పెద్దమొత్తంలో వరదనీరు రిజర్వాయర్‌కు చేరుతుంది. దీంతో మంగళవారం సాయంత్రానికి 57.6 అడుగులకు చేరింది. ప్రస్తుతం నీటిమట్టం స్ధిరంగా ఉందని సిబ్బంది తెలిపారు. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 61 అడుగులు కాగా 59 అడుగులకు సమీపిస్తే బుధవారం సాయంత్రం స్వల్పంగా నీటిని విడుదల చేసే అవకాశం ఉందన్నారు.