కుమ్మేసిన వాన
ABN , Publish Date - May 31 , 2025 | 01:13 AM
ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిన మహా నగరంలో శుక్రవారం మధ్యాహ్నం తరువాత జోరువాన కురిసింది. సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది.
నగరంలో ఈదురుగాలులు, పిడుగులు
జలమయమైన లోతట్టు ప్రాంతాలు
తీవ్ర ఇబ్బందులకు గురైన వాహనచోదకులు
గంభీరంలో 41.5 మి.మీ. వర్షపాతం నమోదు
విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి):
ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిన మహా నగరంలో శుక్రవారం మధ్యాహ్నం తరువాత జోరువాన కురిసింది. సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది. ఈదురుగాలులు, పిడుగులతో కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. ఆరుబయట ఉన్నవారంతా తడిసిముద్దయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగింది. దీంతో సముద్రం నుంచి తేమగాలులు వీయడంతో దట్టంగా మేఘాలు నగరంపై కమ్మేశాయి. ఈ ప్రభావంతో ఈదురుగాలులు, పిడుగులు సంభవించడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాదాపు గంటన్నరపాటు కురిసింది.
నగరంతోపాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో పెద్దఎత్తున నీరు చేరింది. పూర్ణామార్కెట్, బీచ్ రోడ్డు, వన్‌టౌన్ కొత్త రోడ్డు, రామకృష్ణా బజార్, మునిసిపల్ స్టేడియం, రైల్వే స్టేషన్, జ్ఞానాపురం, రైల్వే న్యూకాలనీ, ఇసుకతోట, మద్దిలపాలెం, హనుమంతవాక, హెచ్‌బీ కాలనీ, తదితర ప్రాంతాల్లోని రహదారులపై పెద్దఎత్తున నీరు చేరడంతో చెరువులను తలపించాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించేందుకు పాదచారులు, వాహనదారులు నానాపాట్లు పడ్డారు. జ్ఞానాపురం రైల్వే బ్రిడ్జి కింద రెండు అడుగుల వరకు నీరు నిలిచిపోవడంతో పలువురి ద్విచక్ర వాహనాలు మొరాయించాయి. దీంతో వారు తమ వాహనాలను తోసుకుంటూ ముందుకు సాగారు. వర్ష తీవ్రతకు డ్రైనేజీలు, గెడ్డలు పొంగిపొర్లాయి. కొన్నిచోట్ల రోడ్లపైకి చెత్తాచెదారం, ప్లాస్టిక్ సామగ్రి పేరుకుపోవడంతో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించేందరు ఇక్కట్లకు గురయ్యారు. సాయంత్రం పూట ఫుట్‌పాత్ వ్యాపారాలు సాగించే వారికి వర్షం అడ్డంకిగా మారింది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల వరకు గంభీరంలో 41.5 మిల్లీమీటర్లు, ఆరిలోవలో 40.5, సీతమ్మధారలో 38.75, పెదజాలారిపేటలో 38.5, శిల్పారామం జాతర వద్ద 36.0 మి.మీ. వర్షపాతం నమోదైంది.