Share News

జోరు వాన

ABN , Publish Date - May 27 , 2025 | 10:59 PM

మన్యంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయగా, ఆ తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది.

జోరు వాన
సీలేరులో వర్షం

వారం రోజులుగా వదలని వర్షం

రహదారులు జలమయం

పాడేరు, మే 27(ఆంధ్రజ్యోతి): మన్యంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయగా, ఆ తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. పాడేరు మొదలుకుని ఏజెన్సీలోని అన్ని మండలాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పాడేరులో ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండ తీవ్రంగానే కాసింది. ఆ తరువాత ఆకాశం మేఘావృతమై భారీగా వర్షం పడింది. అయితే గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా మార్పులేదు. కొయ్యూరులో 32.7, పాడేరులో 32.2, జీకేవీధిలో 31.7, డుంబ్రిగుడలో 31.6, అరకులోయలో 30.5, హుకుంపేటలో 29.9, చింతపల్లి, అనంతగిరిలో 29.7, జి,మాడుగులలో 28.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అరకులోయలో...

అరకులోయ: మండలంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన వర్షం రాత్రి ఏడు గంటల వరకు పడింది. ఉదయం నుంచి ఎండ కాయగా, సాయంత్రం నుంచి వర్షం కురవడంతో రహదారులు చిత్తడిగా మారాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో గిరి రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

అనంతగిరిలో..

అనంతగిరి: మండలంలో మంగళవారం ఉదయం నుంచి ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఘాట్‌రోడ్డుపై వర్షపు నీరు ప్రవహించింది. దీంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. అనంతగిరి, కాశీపట్నం గోస్తనీ నది, వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది.

జి.మాడుగులలో..

జి.మాడుగుల: మండలంలో మంగళవారం సాయంత్రం జోరువాన కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండకాసింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. జాతీయ రహదారి పనులు చేపడుతున్న క్రమంలో జి.మాడుగుల రహదారి చిత్తడిగా మారింది. దీంతో వాహనదారులతో పాటు పాదచారులు ఇబ్బందులు పడ్డారు.

డుంబ్రిగుడలో..

డుంబ్రిగుడ: మండల పరిధిలో మంగళవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం చిరుజల్లులతో మొదలై సాయంత్రం ఐదు గంటలకు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రహదారులు బురదమయంగా మారాయి.

ముంచంగిపుట్టులో..

ముంచంగిపుట్టు: మండల పరిధిలో మంగళవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. స్థానిక ప్రధాన రహదారిపై వరదనీరు ప్రవహించింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కురిసిన వర్షం వలన విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుత్తులపుట్టు నుంచి పెదబయలు వచ్చే మార్గంలో హెచ్‌టీ లైన్‌లో సాంకేతికలోపం తలెత్తినట్టు తెలిసింది. దాని వలన విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రాత్రి వరకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో కళకళలాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జోలాపుట్టు జలాశయం నిండుకుండలా ఉంది.

సీలేరులో...

సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండగా, మధ్యాహ్నం నుంచి మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. సాయంత్రం 6.30 గంటల సమయంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో సీలేరు, ధారకొండ, దుప్పులవాడలో రహదారులు జలమయమయ్యాయి.

Updated Date - May 27 , 2025 | 10:59 PM