భారీ వర్షం
ABN , Publish Date - May 25 , 2025 | 11:25 PM
మన్యంలోని పలు మండలాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం నుంచి కుండపోతగా వాన పడింది. చింతపల్లి మండలంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘావృతమై వుంది.
పలు మండలాల్లో రహదారులు జలమయం
జనజీవనానికి అంతరాయం
చింతపల్లి, మే 25 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని పలు మండలాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం నుంచి కుండపోతగా వాన పడింది. చింతపల్లి మండలంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘావృతమై వుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి లంబసింగి, రాజుపాకలు, చింతపల్లి, అన్నవరం, లోతుగెడ్డ, చిన్నగెడ్డ, కోరుకొండ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలకు వర్షపు నీరు చేరుకున్నది. కాగా వర్షం వల్ల కోరుకొండ వారపు సంతలో వినియోగదారులు, వర్తకులు ఇబ్బంది పడ్డారు.
జి.మాడుగులలో...
జి.మాడుగుల: మండలంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి కాస్త ఎండ కాయగా, మధ్యాహ్నం వాతావరణం మారిపోయింది. దట్టంగా మేఘాలు అలుముకుని భారీ వర్షం కురిసింది.
కొయ్యూరులో..
కొయ్యూరు: మండలంలో ఉదయం 10 గంటల వరకు ఎండ కాసింది. ఆ తరువాత మేఘాలు దట్టంగా కమ్ముకుని చిరుజల్లులతో వర్షం ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి.
పెదబయలులో..
పెదబయలు: మండలంలోని మారుమూల గ్రామాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో జనజీవనానికి అంతరాయం కలిగింది. గిన్నెలకోట, ఇంజరి పంచాయతీలోని గుండలగరువు, నడింవాడ, మల్లెపుట్టు, గౌడుపుట్టు, వనగరాయి, చీకుపనస గ్రామాల్లో కురిసిన వర్షానికి మట్టి రోడ్లు చిత్తడిగా మారాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు.