భారీవర్షం
ABN , Publish Date - May 21 , 2025 | 12:50 AM
నగరంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం ఏడు గంటల వరకూ భారీవర్షం కురిసింది.
తెల్లవారుజాము నుంచి రెండు గంటల పాటు వర్షం
సాగర్‌నగర్‌లో 75.5 మి.మీ.నమోదు
మరో రెండు, మూడు రోజులు వర్షాలు
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి):
నగరంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం ఏడు గంటల వరకూ భారీవర్షం కురిసింది. తరువాత కొంత సమయం చిరుజల్లులు కురిశాయి. సోమవారం అర్ధరాత్రి నగరంపైకి సముద్రం నుంచి భారీగా తేమ మేఘాలు వచ్చాయి. దీంతో తెల్లవారుజామున వర్షం మొదలైంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. సముద్రానికి ఆనుకుని ఉన్న సాగర్‌నగర్, ఎండాడ, రుషికొండ, విశాలాక్షి నగర్, ఎంవీపీ కాలనీతో పాటు వెంకోజీపాలెం, ఆరిలోవ, హెచ్‌బీ కాలనీల్లో భారీవర్షం కురిసింది. ఆ సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగుల శబ్దంతో నగరం దద్దరిల్లింది. కొన్నిచోట్ల భారీవర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. జ్ఞానాపురం రైల్వే అండర్‌పాస్ వద్ద భారీగా నీరు చేరింది. అటువైపు వెళ్లే ఓ బస్సు ఆ నీటిలో చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్రేన్ సాయంతో బయటకు తీశారు. వర్షం కురవడంతో నగరంలో వాతావరణం కొంతవరకు చల్లబడింది.
సాగర్ నగర్‌లో 75.5 మి.మీలు
మంగళవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు నగరంలో పలుచోట్ల భారీవర్షం కురిసింది. అత్యధికంగా సాగర్‌నగర్‌లో 75.5 మి.మీ. నమోదైంది.
సెంటర్ మి.మీ.
సాగర్‌నగర్ 75.5
విశాఖ వ్యాలీ స్కూలు 70
సీతమ్మధార 65
హెచ్‌బీ కాలనీ 61.75
ఎండాడ 51
మహారాణిపేట 41.25
కాపులుప్పాడ 38
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
వచ్చే రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటుచేసినట్టు జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీశంకర్ తెలిపారు. ఈనెల 23వ తేదీ వరకు 24 గంటలపాటు కంట్రోల్‌రూమ్ సేవలు అందిస్తుందన్నారు. కంట్రోల్ రూమ్‌లో ఫోన్ నంబర్లు 0891-2590100, 0891-2590102 అందుబాటులో ఉంటాయన్నారు.