Share News

భారీ వర్షం

ABN , Publish Date - May 04 , 2025 | 10:45 PM

మన్యంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీని వల్ల రహదారులు జలమయమయ్యాయి. చింతపల్లి మండలంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

భారీ వర్షం
చింతపల్లిలో వర్షం

లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం

చింతపల్లి, మే 4 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీని వల్ల రహదారులు జలమయమయ్యాయి. చింతపల్లి మండలంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అకాల వర్షం వల్ల ప్రజలు అవస్థలు పడ్డారు. ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు వర్షపు నీటితో నిండిపోయాయి. వర్షం వల్ల కోరుకొండ వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.

పెదబయలులో..

పెదబయలు: మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కుండపోత వర్షం కురిసింది. పెదబయలులో తెల్లవారుజాము నుంచి ముసురు నెలకొంది. ఉదయం 7 గంటల నుంచి కుండపోతగా వర్షం కురిసింది. మారుమూల గిన్నెలకోట, ఇంజరి పంచాయతీల పరిధిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. సాయంత్రం నాలుగు గంటల తరువాత తెరిపి ఇచ్చింది.

జీకేవీధిలో..

గూడెంకొత్తవీధి: మండలంలో ఓ మోస్తరు వర్షం పడింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విడతలవారీగా మోస్తరు వర్షం కురిసింది. వర్షం వల్ల వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. జర్రెల వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు అవస్థలు పడ్డారు.

సీలేరులో...

సీలేరు: సీలేరు, ధారకొండ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం పడింది. వర్షం వల్ల ధారకొండ వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు అవస్థలు పడ్డారు. వర్షానికి లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి.

ముంచంగిపుట్టులో...

ముంచంగిపుట్టు: మండల పరిధిలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అలాగే శనివారం అర్థరాత్రి భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. అకాల వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులు వర్షపు నీటితో చిత్తడిగా మారాయి. పలు చోట్ల వాగులు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

Updated Date - May 04 , 2025 | 10:45 PM