ప్రజా సమస్యలపై వాడీవేడిగా చర్చ
ABN , Publish Date - May 06 , 2025 | 01:19 AM
జిల్లాలో నెలకొన్న వివిధ రకాల సమస్యలపై సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా మండలి (డీఆర్‌సీ) సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించారు. సాగు, తాగునీటి సమస్యలు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, చెరకు రైతులకు బకాయిల చెల్లింపు, అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో లంచాల వసూళ్లు, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట నియోజకవర్గాలకు నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పలువురు సభ్యులు సూచనలు, సలహాలు అందించారు.
జిల్లా అభివృద్ధిపై డీఆర్‌సీలో సభ్యుల సలహాలు, సూచనలు
జిల్లా యూనిట్‌గా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అభివృద్ధి
ఖరీఫ్ ఆరంభం అయ్యేలోగా సాగునీటి వనరులకు మరమ్మతులు
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర
తాగునీటి సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సెల్
స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచన
గోవాడ షుగర్స్ కార్మికులు, రైతులకు బకాయిలు ఎప్పుడిస్తారు
ఎమ్మెల్సీ బొత్స డిమాండ్
గ్రామీణ నియోజకవర్గాలకు అధిక నిధులివ్వాలి
ఎమ్మెల్యే బండారు వినతి
ఎన్టీఆర్ ఆస్పత్రిలో అవినీతిపై విచారణ జరపాలి
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్
అనకాపల్లి, మే 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నెలకొన్న వివిధ రకాల సమస్యలపై సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా మండలి (డీఆర్‌సీ) సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించారు. సాగు, తాగునీటి సమస్యలు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, చెరకు రైతులకు బకాయిల చెల్లింపు, అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో లంచాల వసూళ్లు, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట నియోజకవర్గాలకు నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పలువురు సభ్యులు సూచనలు, సలహాలు అందించారు. తొలుత కలెక్టర్ విజయకృష్ణన్.. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న ప్రణాళికలు, గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల గురించి వివరించారు. అనకాపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదన చేయనున్నట్టు తెలిపారు. అనంతరం మంత్రి రవీంద్ర మాట్లాడుతూ, జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని, దీనికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్లాలన్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభం అయ్యేలోగా సాగునీటి వనరులకు మరమ్మతులు, అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వనరులను వినియోగించుకొని యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, జీడీపీఎస్‌ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, జిల్లా సమీక్షా మండలి సమావేశాల్లో ఒక్కోసారి ఒక్కో ఆంశంపై విస్తృతంగా చర్చ జరగాలని సూచించారు. తాగునీటి సమస్యలపై ప్రజలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు సరఫరా చేస్తున్న వస్తువులు మార్కెట్ రేటు కంటే ఎక్కువగా ఉంటున్నాయని, అందువల్ల పంచాయతీకి కావాల్సిన వస్తువులను సర్పంచులే నేరుగా కొనుగోలు చేసుకొనే అవకాశం ఇవ్వాలన్నారు.
శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, చెరకు సరఫరా చేసిన రైతులకు సుమారు రూ.40 కోట్ల బకాయిలు వున్నాయని, వీటిని ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా మినరల్ ఫండ్ నిధులు అన్ని మండలాలకు సమానంగా అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, చెరకు రైతుల సమస్యపై స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సీఎం చంద్రబాబునాయుడుతో చర్చించి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు.
మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, ఇటీవల ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.3 కోట్లు చొప్పున నాబార్డు నిధులు కేటాయించారని, పూర్తిగా గ్రామీణ ప్రాంతమైన మాడుగుల, చోడవరం, పాయకరావుపేట నియోజకవర్గాలకు.. మునిసిపల్ కార్పొరేషన్లు వున్న నియోజకవర్గాలకు ఒకే విధంగా నిధులు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై ఇన్‌చార్జి మంత్రి ఆలోచన చేసి గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలకు అధిక నిధులు కేటాయించాలని కోరారు.
చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు మాట్లాడుతూ, సుజల స్రవంతి ప్రాజెక్టుకు భూసేకరణ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ముందుగానే తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
ఎన్టీఆర్ ఆస్పత్రిలో అవినీతిపై విచారణ జరపాలి
జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ఆస్పత్రి ప్రసూతి విభాగం సిబ్బంది, రోగుల సహాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. కలెక్టర్ విజయకృష్ణన్ స్పందిస్తూ.. గతంలో ఒక పేషెంట్ నుంచి కొంత సొమ్ము వసూలు చేసినట్టు ఫిర్యాదు రాగా.. ఒక ఉద్యోగిని సస్పెండ్ చేశామన్నారు. మళ్లీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉన్న ఒక వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళితే ఆమె మృతిచెందిందని, అక్కడ వున్న సిబ్బంది ఆమె చెవి దుద్దులు చోరీ చేశారని అన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా స్పందిస్తూ.. దీనిపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నామన్నారు. సమీక్షా సమావేశానికి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, గండి బాబ్జీ, మళ్ల సురేంద్ర, పీవీజీ కుమార్, జేసీ జాహ్నవి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.