వైద్యంపై వాడీవేడిగా చర్చ
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:51 AM
అనకాపల్లి జిల్లాలో రొమ్ము క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులబారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నదని, ఇందుకుగల కారణాలను తెలుసుకుని సత్వర వైద్య పరీక్షలు, చికిత్స అందించాలని జడ్పీటీసీ సభ్యులు కోరారు. జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన మంగళవారం జడ్పీ సమావేశమందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది.
జిల్లాలో క్యాన్సర్, కిడ్నీ బాధితులు పెరుగుతుండడంపై జడ్పీ సమావేశంలో సభ్యుల ఆందోళన
సత్వరమే వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించాలని వినతి
పలు అంశాలను సభలో ప్రస్తావించిన సభ్యులు
అనర్హులకు పింఛన్లు రద్దు చేయాలని ప్రతిపాదన
తప్పుడు సదరం సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులపై చర్యలకు డిమాండ్
ఫార్మా, పవర్ ప్లాంట్ల కాలుష్యంతో ‘పరవాడ’ ప్రజల ఇక్కట్లు
విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి జిల్లాలో రొమ్ము క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులబారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నదని, ఇందుకుగల కారణాలను తెలుసుకుని సత్వర వైద్య పరీక్షలు, చికిత్స అందించాలని జడ్పీటీసీ సభ్యులు కోరారు. జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన మంగళవారం జడ్పీ సమావేశమందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ, కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో అత్యవసర సమయంలో వైద్య సేవలు అందడంలేదని అన్నారు. తొలుత వైద్య, ఆరోగ్య శాఖపై జరిగిన చర్చలో ఎస్.రాయవరం జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి మాట్లాడుతూ, మండలంలోని చినగుమ్ములూరులో ఇటీవల పలువురు మహిళలు రొమ్ము క్యాన్సర్‌బారిన పడ్డారని, ఇందుకు కారణాలు తెలుసుకుని నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ విజయకృష్ణన్ స్పందిస్తూ.. వైద్య నిపుణుల బృందాన్ని చినగుమ్ములూరు పంపి, రొమ్ము క్యాన్సర్‌పై అధ్యయనం చేయిస్తామని చెప్పారు. నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ మాట్లాడుతూ, మండల పరిధిలోని దుగ్గాడలో కిడ్నీ సంబంధిత వ్యాధిబారినపడి ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయారని, ఒక యువకుడికి రెండు కిడ్నీలు పాడయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామానికి వైద్యుల బృందాన్ని పంపిస్తామని, ప్రతి 15 రోజులకొకసారి నీటి నమూనాలు సేకరించి విశ్లేషిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అనకాపల్లిలోని జిల్లా ఆస్పత్రిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుచేయాలని మునగపాక జడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామిసత్యనారాయణ కోరగా.. రూ.22 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ వచ్చే ఏడాది మార్చికల్లా అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ విజయకృష్ణన్ బదులిచ్చారు. అచ్యుతాపురంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి మార్చి లేదా ఏప్రిల్ నాటికి సిద్ధం అవుతుందని ఆమె తెలిపారు.
బుచ్చెయ్యపేట జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు మాట్లాడుతూ, సామాజిక పింఛన్లకు సంబంధించి అనర్హులను ఏరివేయాలని, కొంతమంది అక్రమంగా సదరం సర్టిఫికెట్లు సంపాదించి దివ్యాంగుల పింఛన్లు తీసుకుంటుండగా, మరోవైపు అంగవైకల్యం ఉన్నవారికి పింఛన్లు నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలమంచిలి ఎంపీపీ రాజాన శేషు మాట్లాడుతూ, తప్పుడు సదరం సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పరవాడ మండలంలో ఫార్మాసిటీ, హిందూజా, ఎన్టీపీసీల నుంచి వెలువడే కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు ఆందోళన వ్యక్తంచేశారు. కాలుష్యాన్ని నిర్ధారించే యంత్రాలు కొన్నిసార్లు పనిచేయడం లేదని చెప్పారు. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పీవీ ముకుందరావు స్పందిస్తూ.. తాణాం, తాడి గ్రామాల వద్ద రెండు యంత్రాలు ఉన్నాయని, వాటి నుంచి ఎప్పటికప్పుడు రీడింగ్ తీసుకుంటున్నామని చెప్పారు. అనకాపల్లి జిల్లా పరిధిలో బీఎన్ రోడ్డు, వడ్డాది-పాడేరు రోడ్డు మాడుగుల మండల పరిధిలో దారుణంగా వుందని సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు.
అనంతగిరి, నక్కపల్లి జడ్పీటీసీ సభ్యులు డి.గంగరాజు, గోసల కాసులమ్మ మాట్లాడుతూ, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సీపీఎం నాయకుడు అప్పలరాజుపై పీడీ యాక్టు నమోదు చేసి అరెస్టు చేయడం దారుణమని, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేయగా.. జడ్పీ చైర్‌పర్సన్ జోక్యంచేసుకుని దీనిపై తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకంలో కేంద్రం వాటా 90 శాతం కొనసాగించాలని కోరుతూ తీర్మానం చేయాలని ప్రతిపాదించగా సభ్యులు ఆమోదించారు. సమావేశంలో జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజకుమార్, వైస్‌చైర్మన్లు బీవీ సత్యవతి, సుంకరి గిరిబాబు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఒక్కరు కూడా జడ్పీ సమావేశానికి హాజరుకాలేదు.