వానాకాలంలో వడగాడ్పులు
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:55 AM
అనకాపల్లి పట్టణంలో వాతావరణం మండు వేసవిని తలపిస్తోంది. వర్షాలతో చల్లబడాల్సిన వాతావరణం అధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కుతోంది. గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వానాకాలంలో ఈ వడగాడ్పులు ఏమిటని ప్రజలు వాపోతున్నారు. గత వారంలో కేవలం 34 డిగ్రీల లోపు ఉండే ఉష్ణోగ్రతలు ఈ నెల 9వ తేదీన 35 డిగ్రీలు, 10న 36 డిగ్రీలకు, 11న 37.1, 12వ తేదీ శనివారం 37.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఎండ వేడిమికి తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు.
రోజురోజుకు వేడెక్కుతున్న వాతావరణం
ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు
అనకాపల్లి టౌన్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి పట్టణంలో వాతావరణం మండు వేసవిని తలపిస్తోంది. వర్షాలతో చల్లబడాల్సిన వాతావరణం అధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కుతోంది. గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వానాకాలంలో ఈ వడగాడ్పులు ఏమిటని ప్రజలు వాపోతున్నారు. గత వారంలో కేవలం 34 డిగ్రీల లోపు ఉండే ఉష్ణోగ్రతలు ఈ నెల 9వ తేదీన 35 డిగ్రీలు, 10న 36 డిగ్రీలకు, 11న 37.1, 12వ తేదీ శనివారం 37.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఎండ వేడిమికి తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఉష్ణతాపం ప్రారంభం కావడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వడగాడ్పుల కారణంగా రహదారులపై జనసంచారం పలుచబడింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగించే ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. పలు సందర్భాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లుతుండడంతో ప్రజలు ఇళ్లల్లో ఉండలేక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫ్యాన్‌ల కింద కూర్చున్నా చెమటలు పడుతున్నాయంటే ఉష్ణతాపం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదిఏమైనా ప్రస్తుతం వర్షాలతో చల్లగా ఉండాల్సిన వాతావరణం రోజురోజుకు వేడెక్కుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.