ఆరోగ్య పథకాలు భేష్
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:21 PM
ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు చాలా మంచివని, అయితే అధికారులు అమలు చేయడంలోనే లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకుంటే ఫలితాలు బాగుంటాయని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
అమలు తీరులోనే లోపాలు
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు చాలా మంచివని, అయితే అధికారులు అమలు చేయడంలోనే లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకుంటే ఫలితాలు బాగుంటాయని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం ఏరియా ఆస్పత్రిలో స్వస్థ్ నారీ- సశక్తి అభియాన్ కార్యక్రమంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీ స్ర్కీనింగ్, బాల్య వివాహాలు, మానసిక సమస్యలు, సికిల్‌సెల్ ఎనీమియా, ఐసీడీఎస్ పౌష్టికాహారం కౌంటర్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు సందర్శించారు. అనంతరం ప్రాంతీయ ఆస్పత్రి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వస్థ్ నారీ- సశక్తి అభియాన్ కార్యక్రమం చాలా మంచిదన్నారు. ఆశ కార్యకర్తలు వారి పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్లి మహిళల ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసు కోవడంతో పాటు గర్భిణులు ఉంటే హెల్త్ కార్డులో నమోదు చేయాలన్నారు. ఆశ కార్యకర్తలు పని తీరు మెరుగు పరుచుకోవడం లేదన్నారు. గర్భిణుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు చేసిన తరువాత రోగిని విశాఖపట్నం పంపించి వైద్యం చేయించాలని సూచించారు. రానుబోను చార్జీల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. 70 సంత్సరాలు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.5 లక్షల విలువైన ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తుందన్నారు. ఏరియా ఆస్పత్రికి వచ్చే గర్భిణులు ప్రసవం అయ్యే వరకు రెండు మూడు రోజు ఉండడానికి రూ.2.1 కోట్ల నిధులతో 50 పడకలతో ప్రత్యేకంగా నిరీక్షణ విభాగం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యవంతమైన స్త్రీ కోసం.... శక్తివంతమైన కుటుంబం కోసం కృషి చేస్తామని డీప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జ్యోతి ప్రతిజ్ఙ చేయించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాశారద, ఆర్డీవో వీవీ రమణ, తహశీల్దార్ రామారావు, జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, జనసేన నియోజకవర్గం ఇన్‌చార్జి సూర్య చంద్ర, తదితరులు పాల్గొన్నారు.