మహిళలకు ఆరోగ్య రక్ష
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:17 AM
మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
నేటి నుంచి ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’
ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీకారం
ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబునాయుడు
పక్షం రోజులపాటు పరీక్షల నిర్వహణకు ప్రత్యేక శిబిరాలు
అనారోగ్య సమస్యలపై నిపుణులతో అవగాహన కలిగించే కార్యక్రమాలు
ఆరోగ్యశాఖ సన్నద్ధం
పదుల సంఖ్యలో వైద్యులు, సిబ్బంది నియామకం
విశాఖపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని అమలును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు పక్షం రోజులపాటు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించి మహిళలకు వివిధ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆరోగ్య శాఖ పెద్దఎత్తున వైద్యులు, సిబ్బందిని కేటాయించింది. స్వస్థ్ నారీ సశక్త్ అభియాన్ పరివార్...అంటే ఆరోగ్యవంతమైన మహిళ-శక్తివంతమైన కుటుంబమని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఆరోగ్యంపై అవగాహన పెంచడం, వైద్య సేవలు అందించడం, పోషకాహారాన్ని తీసుకునేలా ప్రోత్సహించడం, కుటుంబాలను అందుకు అనుగుణంగా సన్నద్ధం చేయడం చేస్తారు.
మహిళలకు చేకూరనున్న మేలు
ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా మహిళలకు గుండె జబ్బులు, మధుమేహం, నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్, తదితర పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి మెరుగైన వైద్య సేవలను అందిస్తారు. మహిళలు, కిశోర బాలికల్లో రక్తహీనతను గర్తించి తగిన చికిత్స అందిస్తారు. గర్భిణులకు పరీక్షలు నిర్వహించి పోషకాహారం ఆవశ్యకతను తెలియజేస్తారు. కిశోర బాలికలకు హిమోగ్లోబిన్, రక్తహీనత వంటి సమస్యలు ఉంటే వారికి అవసరమైన వైద్య సేవలను అందించేలా చర్యలు చేపడతారు. పిల్లల్లో సికిల్‌సెల్ ఎనీమియా వంటి ఇబ్బందులు ఉంటే రిఫరల్ ఆస్పత్రులకు పంపిస్తారు. పిల్లలకు, గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలను అందించనున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులను పంపిణీ చేయడం, ఇతర వ్యాధులపై అవగాహన కలిగించేలా ఈ ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతాయి.
ప్రత్యేక వైద్య శిబిరాలు ఎక్కడంటే.?
పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో ఈ ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నారు. ఇందులో వైద్య, ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, మునిసిపల్, డీఆర్‌డీఏ, విద్యా శాఖ అధికారుల సహకారం, సమన్వయంతో ఈ ప్రోగ్రామ్‌ను అమలు చేయనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 135 క్యాంపులను నిర్వహించనున్నారు. ఆయా క్యాంపుల్లో 10,56,000 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం 236 మంది స్పెషలిస్టు వైద్యులను కేటాయించారు. మరో 20 మంది ప్రాజెక్టు ఆఫీసర్లు, 159 మంది స్టాఫ్ నర్సులు, 75 మంది ఫార్మసిస్టులు, 75 మంది ల్యాబ్ టెక్నీషియన్స్‌ను నియమించారు.
మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబానికి భరోసా
- డాక్టర్ పి.జగదీశ్వరరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబానికి భరోసా లభిస్తుంది. ఆ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇదే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. 15 రోజులపాటు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించి మహిళలకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. వారికి ఆరోగ్యం పట్ల అవగాహన కూడా కలిగించేలా ఈ శిబిరాలు నిర్వహిస్తాం. ఏయూ కన్వెక్షన్ సెంటర్‌లో బుధవారం సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. మూడు వేల మంది మహిళలకు పరీక్షలు నిర్వహిస్తాం. ఇందుకోసం 22 మంది స్పెషలిస్టు వైద్యులు, 18 మంది ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 20 మంది స్టాఫ్ నర్సులు, ఐదుగురు ఫార్మసిస్టులు, నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు, 50 మంది ఇతర సిబ్బంది, మరో15 కియోస్క్‌లు ఏర్పాటు చేశాం.