Share News

చిన్నారులకు హెల్త్‌కార్డులు

ABN , Publish Date - Dec 08 , 2025 | 01:16 AM

జిల్లాలో చిన్నారుల హెల్త్‌ కార్డుల పంపిణీ ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు.

చిన్నారులకు హెల్త్‌కార్డులు

జిల్లాలో 15 ఏళ్లలోపు 2,26,799 మందికి పంపిణీ

ఏటా రెండు దశల్లో ఆరోగ్య పరీక్షలు

కార్డుల్లో పూర్తి ఆరోగ్య సమాచారం నిక్షిప్తం

విశాఖపట్నం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో చిన్నారుల హెల్త్‌ కార్డుల పంపిణీ ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య ప్రొగ్రామ్‌ (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. వైద్య పరీక్షల అనంతరం చిన్నారులకు ఆరోగ్య సమాచారంతో కూడిన హెల్త్‌కార్డులను అందిస్తోంది. ఇప్పటికే రెండు దశల్లో పరీక్షలు నిర్వహించిన ఆరోగ్యశాఖ అధికారులు అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న 2,26,799 మంది చిన్నారులకు ఆరోగ్య సమాచారంతో కూడిన కార్డులను అందించింది.

వీరిలో ఆరునుంచి ఐదేళ్లలోపు వయసు కలిగిన అంగన్‌వాడీ కేంద్రాల్లోని 90,152 మంది చిన్నారులు, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 62,569 మంది, ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 74,230 మంది విద్యార్థులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు పదివేల మంది, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 16 వేల మంది, ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 20 వేల మందికి కొత్త కార్డులను అందించారు. మొత్తంగా జిల్లాలో సుమారు 2.27 లక్షల మందికి పంపిణీ చేశారు.

పరీక్షల నిర్వహణ ఇలా..

రాష్ట్రీయ బాలస్వాస్థ్య ప్రొగ్రామ్‌ (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా చిన్నారులకు ప్రభుత్వం ఏటా రెండుసార్లు హెల్త్‌ స్ర్కీనింగ్‌ నిర్వహిస్తోంది. మొదటి దశలో ఏఎన్‌ఎం, మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌ఎహెచ్‌పీ) పాఠశాలలకు స్ర్కీనింగ్‌ చేస్తారు. సమస్యలు గుర్తిస్తే రెండో దశ స్ర్కీనింగ్‌ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళతారు. అక్కడ వైద్యుడు పరీక్షించి మందులు ఇస్తారు. అక్కడ పరిష్కరించలేని సమస్యలను గుర్తిస్తే డిస్ర్టిక్‌ ఎర్లీ ఇంట్రివెన్షన్‌ సెంటర్‌, బోధనాస్పత్రులకు తరలిస్తారు. అందుకు అవసరమైన ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ బాధ్యత స్థానిక ఆరోగ్యశాఖ సిబ్బంది చూసుకుంటారు. అవసరమైతే సర్జరీలు చేస్తారు. కొందరు చిన్నారుల్లో గ్రహణం మొర్రి, పుట్టుకతో వినికిడి సమస్య, మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందులను గుర్తిస్తే వైద్య సేవలు అందిస్తారు.

హెల్త్‌ కార్డులో సమాచారం

చిన్నారులకు అందించిన హెల్త్‌ కార్డు ‘బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష’ పేరుతో ఉంటుంది. వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత విద్యార్థికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని పొందుపరుస్తారు. ఈ హెల్త్‌ కార్డు (బుక్‌)లో చిన్నారి ఎత్తు, బరువుతోపాటు మరో ఏడు రకాల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలుంటాయి. విద్యార్థి వయసు, చదువు, స్కూల్‌/అంగన్‌వాడీ కేంద్రం, తల్లిదండ్రుల పేర్లు, చిరునామాతో కూడిన వివరాలు ఉంటాయి. ఈ స్ర్కీనింగ్‌ ప్రక్రియలో వ్యాధులు (డిసీజెస్‌), శరీర అభివృద్ధిలో ఆలస్యం (డెవలప్‌మెంట్‌ డిలేస్‌), వైకల్యం (డిఫార్మిటీస్‌), డెఫీషియెన్సీ(లోపాలు) గుర్తిస్తారు. సమస్యలను తల్లిదండ్రులు ఆలస్యంగా గుర్తిస్తే మెరుగైన వైద్య సేవలు సాధ్యం కాదని ఆర్‌బీఎస్‌కే కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.హారిక తెలిపారు. వాటిని ముందుగా గుర్తించే ందుకు వీలుగా ప్రభుత్వం స్ర్కీనింగ్‌ చేయిస్తోందన్నారు.

Updated Date - Dec 08 , 2025 | 01:16 AM