హయగ్రీవకు ఝలక్
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:26 AM
వృద్ధుల పేరు చెప్పి కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలం కొల్లగొట్టి దాంతో వందల కోట్ల వ్యాపారం చేసిన ‘హయగ్రీవ ఫామ్స్ అండ్ డెవలపర్స్’ సంస్థకు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. దాదాపు పదహారేళ్ల కిందట ఎండాడలో వృద్ధాశ్రమం కోసం ‘హయగ్రీవ’కు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 12.51 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ కూటమమి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. తక్కువ ధరకు వస్తున్నాయని ఎడాపెడా ప్రభుత్వ భూములను కొనుగోలు చేసే వారికి ఇదో పెద్ద గుణపాఠం కానున్నది.

ఎండాడలో భూమిని
వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఫలించిన నాయకుల పోరాటం
వృద్ధాశ్రమం కోసమని భూమి తీసుకుని
ఇష్టారాజ్యంగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మకాలు
దుర్వినియోగం చేస్తున్నట్టు
నిర్ధారణ కావడంతో సర్కారు కొరడా
ప్రభుత్వ భూములకు
కొనుగోలు చేసేవారికి ఇదో హెచ్చరిక
తస్మాత్ జాగ్రత్త
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వృద్ధుల పేరు చెప్పి కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలం కొల్లగొట్టి దాంతో వందల కోట్ల వ్యాపారం చేసిన ‘హయగ్రీవ ఫామ్స్ అండ్ డెవలపర్స్’ సంస్థకు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. దాదాపు పదహారేళ్ల కిందట ఎండాడలో వృద్ధాశ్రమం కోసం ‘హయగ్రీవ’కు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 12.51 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ కూటమమి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. తక్కువ ధరకు వస్తున్నాయని ఎడాపెడా ప్రభుత్వ భూములను కొనుగోలు చేసే వారికి ఇదో పెద్ద గుణపాఠం కానున్నది.
ఎన్నెన్నో మలుపులు
ప్రభుత్వం ‘హయగ్రీవ’ జగదీశ్వరుడికి భూమిని కేటాయిస్తే...అందులో ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టకుండానే దానిపై ఆయన అప్పులు చేశారు. అవసరమైనప్పుడల్లా అప్పులు ఇచ్చిన ఆడిటర్ జి.వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణలు తమ అప్పు మొత్తం తిరిగి ఇవ్వలేదని ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. వారి మనిషిగా గద్దె బ్రహ్మాజీని ఎండీగా పెట్టారు. జగదీశ్వరుడి ప్రమేయం లేకుండా ఆ స్థలంలో పనులు ప్రారంభించారు. ప్లాట్లుగా విభజించారు. రెసిడెన్షియల్ గ్రూపు పథకం పెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా తన మాట చెల్లుబాటు కావడంతో ఎంవీవీ సత్యనారాయణ తెర వెనుక అంతా నడిపించారు. అనుమతులు లేకుండానే పనులు చేపట్టారు. ప్లాట్లు అమ్మేశారు. అధికారులు అనుమతులు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి నిబంధనల ప్రకారం చేస్తామని చెప్పి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కలెక్టర్ మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేయాలని చెబితే ఐదేళ్లయినా చేయలేకపోయారు. హయగ్రీవ ప్రాజెక్టుపై గత ఐదేళ్లూ అధికారులకు, ఎంవీవీకి, ఆడిటర్ జీవీలకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. విచిత్రం ఏమిటంటే...వృద్ధులకు పది శాతం భూమిలోనే ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ పది శాతం పూర్తి చేయడానికి వారికి ఐదేళ్లూ సరిపోలేదు. మిగిలిన భూమిని వాణిజ్యపరంగా లాభదాయకంగా మార్చుకోవడంపైనే వారు దృష్టిపెట్టారు. మంచి లొకేషన్‌లో ఉండడంతో నగరంలోని ధనవంతులు, రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు పెట్టి వాటిని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో జగదీశ్వరుడు రెండేళ్ల క్రితం ‘సెల్ఫీ వీడియో’ విడుదల చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆయనపై వైసీపీ హయాంలో లెక్కలేనన్ని కేసులు పెట్టించారు.
ఎవరికి వారు పోరాటం
ప్రభుత్వ భూమిలో వ్యాపారం సహించలేని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అనేకసార్లు అసెంబ్లీలో ప్రస్తావించారు. భూమిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. అంతకు ముందు ప్రజా పద్దుల సంఘం కూడా ఈ భూమిని తక్కువ ధరకు ఇచ్చారని ఆక్షేపించింది. అనేక ఉల్లంఘనలు, తప్పులు జరగడంతో ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఇవి గుర్తుంచుకోవాలి.
నగరంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజాసేవ ముసుగు వేసుకొని తప్పుడు పనులు చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి, కబ్జా చేసి ప్రాజెక్టులు చేపడుతున్నారు. వాటిలో ఏది కొన్నా ప్రజలు నిండా మునిగిపోవలసిందే. ఇప్పుడు ప్రభుత్వం నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఎన్ని దశాబ్దాల తరువాతైనా ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి తప్పుడు పనులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారి దగ్గర ఏది కొన్నా భవిష్యత్తులో చిక్కులు తప్పవు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కొంటే మునిగిపోవడమే. కాపాడేవారే ఉండరు.