‘హయగ్రీవ’ రిజిస్ట్రేషన్లు బంద్
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:17 AM
ఎండాడలో వృద్ధాశ్రమం పేరుతో హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్ తీసుకున్న భూమి 12.51 ఎకరాలను జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్రరావు మంగళవారం ప్రభుత్వ భూముల జాబితా 22-ఏలో చేర్చారు.

22-ఏలో ఎండాడ భూములు
తప్పులు చేసినందునే స్వాధీనం చేసుకున్నట్టు కలెక్టర్ స్పష్టీకరణ
నాడు గజం రూ.937.5కు తీసుకొని నేడు రూ.41,666.4కు అమ్మకం
విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
ఎండాడలో వృద్ధాశ్రమం పేరుతో హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్ తీసుకున్న భూమి 12.51 ఎకరాలను జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్రరావు మంగళవారం ప్రభుత్వ భూముల జాబితా 22-ఏలో చేర్చారు. ఆ భూమికి సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం సోమవారం రాత్రి ఆదేశాలు ఇవ్వడంతో కలెక్టర్ మంగళవారం ఉదయమే స్వాధీన ప్రక్రియ ప్రారంభించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు కాదని, భూమిని తీసుకున్న సంస్థ ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, దానిని సమర్థించుకోవడం, ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం, స్వార్థంగా వ్యవహరించడం వల్లనే భూమిని వెనక్కి తీసుకున్నామని కలెక్టర్ ప్రత్యేక నోటీసు ద్వారా తెలియజేశారు. దానిని ఆ ప్రాంగణంలో ఆలయం గోడకు అతికించారు. అందులోకి ఎవరూ వెళ్లకుండా కంచె వేయడంతో పాటు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటుచేశారు.
గజం కొన్న ధర రూ.937.50...అమ్మకం ధర రూ.41,666.
హయగ్రీవ జగదీశ్వరుడు ప్రభుత్వం నుంచి ఎండాడలో ఎకరా రూ.45 లక్షల చొప్పున కొన్నారు. ఇది 2008లో జరిగింది. దీనిని పదిహేనేళ్ల తరువాత అందులో మేనేజింగ్ పార్టనర్‌గా చేరిన గద్దె బ్రహ్మాజీ గజం రూ.41,666 చొప్పున విక్రయించారు. అంటే 40 రెట్లు అధిక ధరకు అమ్ముకున్నారు. కలెక్టర్ జారీచేసిన నోటీసులో పరోక్షంగా ఈ అంశం ప్రస్తావించారు. ఓల్డ్‌ఏజ్ హోమ్‌లో 600 గజాల స్థలాన్ని ఒకరికి రూ.2.5 కోట్లకు విక్రయించారని, అందులో రూ.1.5 కోట్లు సొమ్ము తీసుకున్నారని, ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంటే గజం రూ.41,666 చొప్పున అమ్మినట్టు తేలింది. ఇలా వ్యాపార దృక్పథంలో వ్యవహరించినందునే భూ కేటాయింపు రద్దు చేశారు.
వృద్ధులకు ఆశ్రమం నిర్మించకుండానే విల్లాల నిర్మాణం
తీసుకున్న 12.51 ఎకరాల భూమిలో 10 శాతం భూమి ఉపయోగించి వృదుఽ్ధలు, అనాథలు, దివ్యాంగులకు ఆశ్రమం నిర్మిస్తామని, ఉచితంగా నిర్వహిస్తామని ఒప్పందం చేశారు. పదిహేనేళ్లు అయినా దానిని పూర్తి చేయలేదు. కానీ గ్రూపు డెవలప్‌మెంట్ స్కీమ్ కింద 61 మందితో చేసుకున్న ఒప్పందాల మేరకు విల్లాల నిర్మాణం మాత్రం చివరి దశకు తీసుకువచ్చారు. ఈ హామీని కూడా అమలు చేయకపోవడం వల్ల భూమిని రద్దు చేశారు.