Share News

మాదక ద్రవ్యాల వినియోగంతో సమాజానికి చేటు

ABN , Publish Date - Jun 26 , 2025 | 11:30 PM

మాదక ద్రవ్యాల వినియోగం సమాజానికి ఎంతో చేటని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం(నషా ముక్తి భారత్‌ అభియాన్‌) సందర్భంగా గురువారం పాడేరులో చేపట్టిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

మాదక ద్రవ్యాల వినియోగంతో సమాజానికి చేటు
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, తదితరులు

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

పాడేరు, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల వినియోగం సమాజానికి ఎంతో చేటని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం(నషా ముక్తి భారత్‌ అభియాన్‌) సందర్భంగా గురువారం పాడేరులో చేపట్టిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. జిల్లాలో గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. జిల్లా కేంద్రంలో 10 మందితో మొదలైన డీ అడిక్షన్‌ సెంటర్‌, ఇప్పుడు 150 మందికి మత్తు విముక్తికి వైద్యం అందిస్తున్నదన్నారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాల బారినపడిన వారు ఉంటే డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలించాలని ఆయన సూచించారు. వెలుగులో ఉన్న జిల్లా, మండల సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలు, పంచాయతీ సమావేశాలు, ఆశ్రమ పాఠశాలలు, యూత్‌ గ్రూపులు, సఖీ గ్రూపుల్లో సైతం గంజాయి సాగు, వినియోగం నిర్మూలించడంపై తీర్మానాలు చేయాలన్నారు. అనంతరం ’డ్రగ్స్‌ వద్దు బ్రో’ అంటూ అందరితో నినాదాలు చేయించి, మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కలెక్టర్‌ అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం

గంజాయి సాగును వీడిన గిరిజన రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహిస్తున్నామని ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో నషా ముక్తి భారత్‌ అభియాన్‌ ర్యాలీ విజయవంతం చేశారని, అలాగే యోగాకు అల్లూరి సీతారామరాజు జిల్లా సింబల్‌గా మారిందన్నారు. గతేడాది 10 వేల ఎకరాల్లో గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేయడానికి రైతులకు విత్తనాలు, మొక్కలు పంపిణీ చేశామన్నారు. స్మగ్లర్లు బయట ప్రాంతాల నుంచి ఏజెన్సీకి వచ్చి గిరిజనులను ప్రలోభపెట్టి మోసం చేస్తున్నారని, గంజాయి స్మగ్లర్లపై కఠిన చర్యలు చేపట్టి జైలుకు పంపిస్తామని ఎస్‌పీ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి మాట్లాడుతూ గంజాయి సాగు నిర్మూలనపై గిరిజన గ్రామాల్లో అవగాహన కల్పిస్తామన్నారు. అంతకు ముందు అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు స్థానిక ఐటీడీఏ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.ధీరజ్‌, చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతిమిశ్రా, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీ, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌.గౌరీశంకరరావు, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.హేమలతాదేవి, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు, డీఎస్‌పీ షేక్‌ షెహబాజ్‌ అహ్మద్‌, మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పీఎస్‌.రాజు, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, లగిశపల్లి సర్పంచ్‌ పార్వతమ్మ, పలువురు సీడీపీవోలు, వైద్యులు, వివిధ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 11:30 PM