అమరావతికి కలెక్టర్ హరేంధిరప్రసాద్
ABN , Publish Date - Dec 22 , 2025 | 01:28 AM
అధికారిక కార్యక్రమాల నిమిత్తం జిల్లా కలెక్టర్ ఎంఎన్. హరేంధిరప్రసాద్ సోమవారం అమరావతికి వెళ్లనున్నారు.
నేడు కలెక్టరేట్‌లో యథావిధిగా పీజీఆర్‌ఎస్
విశాఖపట్నం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
అధికారిక కార్యక్రమాల నిమిత్తం జిల్లా కలెక్టర్ ఎంఎన్. హరేంధిరప్రసాద్ సోమవారం అమరావతికి వెళ్లనున్నారు. రెండురోజుల పాటు అమరావతిలోనే ఉంటారు. కాగా ముస్సోరిలో జరిగిన శిక్షణకు హాజరైన జాయింట్ కలెక్టర్ కె.మయూర్‌అశోక్ ఆదివారం నగరానికి చేరుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న పీజీఆర్‌ఎస్ లో ఆయన ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఉదయం పదిగంటలకు జరగనున్న కార్యక్రమానికి అధికారులంతా హాజరుకావాలని ఆదేశించారు.
జిల్లాలో 76 శాతం పల్స్ పోలియో
విశాఖపట్నం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 2,09,652 మంది చిన్నారులకు గాను 1,60,895 (76.4) శాతం మందికి పోలియో చుక్కలు వేశారు. ఉదయం ఏడు గంటలకే 1,43,153 మందికి, ఎనిమిది గంటలకు 1,47,504 మందికి చుక్కల మందు వేశారు. జిల్లాలో పలుచోట్ల ఎమ్మెల్యేలు, నగర మేయర్, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షించింది.