వేధింపులు, వెక్కిరింతలు
ABN , Publish Date - Nov 06 , 2025 | 01:25 AM
వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి ఆలయంలో ఓ అధికారి వైఖరి దేవదాయ శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిత్యం చిరాకు ప్రదర్శిస్తూ తనకు ఎదురుపడిన ప్రతి ఒక్కరినీ దూషించడమే అలవాటుగా మార్చుకున్న ఆ అధికారిపై అందరిలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
నిత్య సిబ్బందిపై చిందులు
ఇదీ కనకమహాలక్ష్మి ఆలయంలో ఓ అధికారి తీరు
గ్రహాంతరవాసులంటూ వేద పండితులను ఉద్దేశించి వ్యాఖ్యలు
రావడం, వెళ్లడం తప్ప పని ఏమి ఉందంటూ...వారిపై అసహనం
మహిళా ఉద్యోగికి బెదిరింపు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి ఆలయంలో ఓ అధికారి వైఖరి దేవదాయ శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిత్యం చిరాకు ప్రదర్శిస్తూ తనకు ఎదురుపడిన ప్రతి ఒక్కరినీ దూషించడమే అలవాటుగా మార్చుకున్న ఆ అధికారిపై అందరిలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమ్మవారికి నిత్యం పూజలు చేసే పండితులను సైతం నిందించడం, వెక్కిరించడాన్ని సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. పూజార్లకు భక్తులు వేసే దక్షిణలో వాటా, అన్నదాన సత్రం నుంచి నెల నెలా కొంత మొత్తం ఆశించిన విషయం రెండు నెలల క్రితం పత్రికల్లో రావడంతో సంబంధిత వర్గాలపై సదరు అధికారి మండిపడ్డారు. దీనికి కారణమని భావించి ఒక ఉద్యోగిని వేరే ఆలయానికి బదిలీ చేశారు. మరో ఉద్యోగిని ఏకంగా విధులకే రావద్దని ఆపేశారు.
అమ్మవారి ఆలయంలో భక్తులకు వేదపండితులు ఆశీర్వచనం చేస్తారు. కూర్చోబెట్టి వేదమంత్రాలు పఠిస్తారు. వారి పట్ల ఎందుకు ఏవగింపు కలిగిందో తెలియదు గానీ ‘మీరు గ్రహాంతరవాసులు (ఏలియన్స్)’ అంటూ నిత్యం నిందిస్తున్నారు. ‘మీరు రావడం, వెళ్లడం తప్ప ఇంకేమిటి పని?’ అని చులకనగా చేసి మాట్లాడుతున్నారు.
దాతలపైనా చిన్నచూపే
అమ్మవారి ఆలయంలో జరిగే పూజలకు పలువురు దాతలు నిధులు సమకూరుస్తారు. అటువంటివారు వచ్చినప్పుడు పండితులంతా తగిన మర్యాదలు చేయడం ఆనవాయితీ. ఇటీవల ఒక దాత విజయదశమి నవరాత్రుల్లో లక్ష రూపాయలు విరాళం ఇచ్చి పూలతో అమ్మవారికి పూజలు చేయించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు పూజకు రాగా మొత్తం ముగ్గురికి సిబ్బంది కండువాలు చేసి, ఆశీర్వచనం ఇచ్చారు. ఈ విషయం తెలిసి వారిపై ఆ అధికారి మండిపడ్డారు. ఒక్కరే విరాళం ఇచ్చారని, ముగ్గురికి కండువాలు ఎందుకు వేశారంటూ చిందులు వేశారు. లక్ష రూపాయలు ఇచ్చిన వారికి వంద రూపాయల విలువైన కండువాలు వేయడం తప్పా?...అని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.
ఆ ఉత్సవాలన్నీ దాతల ఖర్చుతోనే
కనకమహాలక్ష్మి ఆలయానికి జగదాంబ సెంటర్‌లో సీతారామ స్వామి ఆలయం కూడా ఉంది. అక్కడ ఇటీవల ఉత్సవాలు నిర్వహించినప్పుడు ఆ ఖర్చు అంతా దాతలే పెట్టుకున్నారు. అయితే అంతా దేవస్థానం నుంచే ఖర్చు చేసినట్టు బిల్లులు పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇదిలావుండగా కనకమహాలక్ష్మి ఆలయంలో అందరి ముందు ఓ మహిళా ఉద్యోగిని పట్టుకొని సదరు అధికారి గట్టిగా గదమాయించినట్టు తెలిసింది. ఇలా అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరినీ అకారణంగా నిందిస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అధికారితో మార్గశిర ఉత్సవాలు నిర్వహించడం కత్తిమీద సామేనని సిబ్బంది వాపోతున్నారు