Share News

ఆనందం మెండుగా... బస్సులు నిండుగా...

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:47 AM

జిల్లాలో ‘స్త్రీశక్తి’ పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది.

ఆనందం మెండుగా... బస్సులు నిండుగా...

  • ‘స్త్రీశక్తి’కి అనూహ్య స్పందన

  • మహిళా ప్రయాణికులతో బస్సులు కిటకిట

  • పథకం వర్తించే 570 బస్సుల్లో శనివారం 1.5 లక్షల మంది ప్రయాణం

  • అందులో మహిళా ప్రయాణికులు 1.1 లక్షలు మంది

  • సింహాచలం, ఇస్కాన్‌ ఆలయాల రూట్లలో 110 శాతం ఆక్యుపెన్సీ

ద్వారకా బస్‌స్టేషన్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ‘స్త్రీశక్తి’ పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. పథకం వర్తించే ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో మూడొంతులు మహిళలే ప్రయాణించారు. స్త్రీశక్తి పథకాన్ని శుక్రవారం సాయంత్రం రాష్ట్రవాప్తంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయడం జరిగింది. జిల్లాలో స్త్రీశక్తి పథకానికి సంబంధించిన 570 బస్సుల్లో శనివారం 1.5 లక్షల మంది ప్రయాణించారు. అందులో 1.1 మంది మహిళలు ఉన్నారు. ఆ బస్సుల్లో వినియోగించిన టికెట్‌ ఇష్యూయింగ్‌ మెషీన్స్‌ (టిమ్స్‌) ఆధారంగా ఈ లెక్కలు తేలాయి.

సింహాచలం, ఆర్‌కే బీచ్‌, సాగర్‌నగర్‌ ఇస్కాన్‌ టెంపుల్‌, జిల్లా పరిషత్‌ శ్రీకృష్ణ మందిరం రూట్లలో తిరిగే బస్సుల్లో 110 శాతం ఆక్యుపెన్సీ నమోదయ్యింది. మహిళలు అధికసంఖ్యలో దేవాలయాలకు రాకపోకలు సాగించినట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

సాధారణంగా వారాంతపు సెలవు రోజుల్లోను, ఇతర సెలవు రోజుల్ల్లోను ఆర్టీసీ విశాఖ రీజియన్‌లోని 804 బస్సుల్లో 1.3 లక్షల మంది ప్రయాణించేవారు. సగటు ఆక్యుపెన్సీ రేషియో 55 శాతంగా ఉండేది. కానీ వారాంతపు సెలవు, కృష్ణాష్టమి పర్వదినం అయినప్పటికీ శనివారం 570 బస్సుల్లో 1.5 మంది ప్రయాణించారు. సగటు ఆక్యుపెన్సీ రేషియో 80 శాతంగా నమోదయ్యింది. ఇది స్త్రీశక్తి ప్రభావమే అని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇక శ్రీకాకుళం, పలాస, టెక్కలి, మందస, పాతపట్నం, రాజాం, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు 80 శాతం ఆక్యుపెన్సీ తో తిరిగాయి. ఇందులో కూడా 60 శాతం జీరో టికెట్లు జారీ అయినట్టు అధికారులు తెలిపారు. రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు, పర్సనల్‌ ఆఫీసర్‌ జె.తిరుపతిలు సింహాచలం, ఆర్‌కే బీచ్‌ రూట్లలో తనిఖీలు చేశారు. బస్సుల్లో స్వయంగా జీరో టికెట్లు జారీచేశారు. ఆధార్‌ కార్డును సెల్‌ఫోన్‌లో చూపించినా మహిళలకు జీరో టికెట్లు జారీ చేయాలని కండక్టర్లను ఆదేశించారు.

ఉచిత రవాణా వల్ల నెలకు రూ.రెండు వేలు ఆదా

జి.సావిత్రి, ప్రైవేటు ఉద్యోగిని, గాజువాక

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి’ పథకం వల్ల మాలాంటి ప్రైవేటు ఉద్యోగులకు ఆర్థికంగా కొంత లబ్ధి కలుగుతుంది. ఇంటి నుంచి పనిచేసే ప్రాంతం సుమారు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది. ప్రైవేటు రవాణా సాధనాల్లో వెళ్లినా, ఆర్టీసీ బస్సుల్లో వెళ్లినా రోజుకు 60 నుంచి 80 రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించడం వల్ల ఆ డబ్బులు సుమారు రూ.2 వేల వరకూ ఆదా అవుతాయి. వాటిని వేరే అవసరాలకు వినియోగించుకునేందుకు వీలు కలుగుతుంది.

Updated Date - Aug 17 , 2025 | 12:47 AM